వారిద్దరూ పిల్లుల్లా కొట్లాడుకున్నారు


Thu,December 6, 2018 02:25 AM

Verma and Asthana were fighting like cats

-అలోక్, ఆస్తానాల గొడవలతో సీబీఐ నవ్వులపాలైంది
-అందుకే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది
-సుప్రీంకోర్టు ముందు తన చర్యల్ని సమర్థించుకున్న కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా ఇద్దరూ పిల్లుల్లా పోట్లాడుకున్నారని, అత్యున్నత స్థాయిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల గొడవలతో సీబీఐ నవ్వులపాలైందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. సీబీఐపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకే తాము వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. తనను అకారణంగా సెలవులపై పంపడాన్ని సవాల్ చేస్తూ అలోక్‌వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్‌లు ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్నది. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ అధికారాల తొలగింపునకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విస్తృతాధికారాలేమిటనే విషయంలో బుధవారం ధర్మాసనం ఎదుట వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివరణను అటార్నీ జనరల్ (ఏజే) కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. గ్రూపు తగాదాల కారణంగా సీబీఐ నవ్వులపాలైంది. అత్యున్నత దర్యాప్తు సంస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకే కేంద్రం జోక్యం చేసుకుంది. అనూహ్య పరిణామాల వల్లే అలోక్‌వర్మను, రాకేశ్ ఆస్తానాను సెలవుపై పంపాల్సి వచ్చింది. పరిధికి లోబడి ఉన్న తన అధికారాల మేరకే ప్రభుత్వం వ్యవహరించింది అని కోర్టుకు వివరణ ఇచ్చారు.

అలోక్‌వర్మ అధికారాలను మాత్రమే ప్రభుత్వం తొలిగించిందని, అయితే అది సరిపోదని ఏజే వాదించారు. అలోక్‌వర్మపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు. అలోక్‌వర్మపై చర్యతీసుకునే ముందు ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన ఎంపిక కమిటీని సంప్రదించాల్సిన అవసరం లేదా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఎంపిక కమిటీ ప్రమేయం.. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపికచేసే వరకే పరిమితం. ఆయనను నియమించేది ప్రభుత్వమే అయినప్పుడు.. ఆయనపై చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికే ఉంటుంది. దీనిగురించి కమిటీని సంప్రదించాల్సిన అవసరంలేదు. సీబీఐపై పూర్తి పర్యవేక్షణాధికారం కేంద్రప్రభుత్వానికి, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి ఉంటుంది అని ఏజే వాదించారు. సీబీఐ డైరెక్టర్ సెలవుపై ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయి వేతనం, ఇతర సౌకర్యాలు యథావిధిగా పొందుతారని సీవీసీ తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. సెలవుపై ఉన్నప్పటికీ అలోక్‌వర్మ.. తన హయాంలో సీబీఐ చేపట్టిన పలు కేసుల దర్యాప్తుల్ని పర్యవేక్షించవచ్చా? అన్న ధర్మాసనం ప్రశ్నకు.. ప్రస్తుతం ఆయనకు ఆ అధికారం లేదని తుషార్ మెహతా తెలిపారు.

461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles