నిర్లక్ష్యాన్ని సహించం


Sat,September 8, 2018 02:41 AM

Up to Rs 5 lakh fine for 10 states not responding to urban expats

-ఆదేశాలకు స్పందించని రాష్ర్టాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
- మూకహత్యల నిరోధానికి తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో వివరాలివ్వండి
- లేదంటే ప్రభుత్వ కార్యదర్శుల్ని కోర్టుకు రప్పిస్తాం
- పట్టణ నిర్వాసితులపై స్పందించని 10 రాష్ర్టాలకు 5లక్షల వరకు జరిమానా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: మూకహత్యల నిరోధక చర్యలు, పట్టణ నిర్వాసితుల సంక్షేమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడింది. సకాలంలో వివరాలివ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టంచేసింది. మూక హత్యల నిరోధానికి తాము జారీచేసిన మార్గదర్శకాలపై తీసుకున్న చర్యలేమిటో వారంరోజుల్లో తెలుపాలని, లేకుంటే ఆయా రాష్ర్టాల ప్రభుత్వ కార్యదర్శుల్ని కోర్టులో నిలబెడుతామని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. పట్టణ నిర్వాసితుల సంక్షేమ కమిటీల ఏర్పాటులో తమ ఆదేశాలు అమలు చేయని 10 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు జరిమానా విధించింది.

గోరక్షకుల దాడుల, మూకహత్యల నిరోధానికి తాము గతంలో జారీ చేసిన మార్గదర్శ కాలపై 29 రాష్ర్టాలు, ఏడు కేంద్రపాలి త ప్రాంతాలకు కేవలం 9 రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయని తెలిపింది. రాష్ట్రప్రభుత్వాలకు చివరి అవకాశం ఇస్తున్నట్లు చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్‌లు ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. మూక హత్యల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి మంత్రుల కమిటీ పనిచేస్తున్నదన్నారు. మూక హత్యల నివారణకు సర్వోన్నత న్యాయస్థానం జూలై 17న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. మూడు రోజుల తర్వాత.. జూలై 20న రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో రక్బర్‌ఖాన్ అనే వ్యక్తి గోరక్షకుల దాడిలో ప్రాణా లు కోల్పోయారు. మూకహత్యల్ని అడ్డుకోవడంలో విఫలమైన రాజస్థాన్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించాలని కాంగ్రెస్ నేత తెహసీన్ పూనావాలా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. తమ మార్గదర్శకాలపై తీసుకున్న చర్యల్ని వివరించాలని ఆదేశించినా 25 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నేటికీ వివరాలు అందకపోవడంపై ధర్మాసనం మండిపడింది.

పట్టణ నిర్వాసితుల బాధ్యత ప్రభుత్వాలదే

పట్టణ నిర్వాసితుల్ని పట్టించుకోకుండా ప్రభుత్వాలు వదిలేయలేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పేదల సంక్షేమానికి రూపొందించిన భారీ పథకాలు పూర్తిస్థాయిలో అమలుకానందున.. వారి బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంటుందని స్పష్టంచేసింది. కూడు, గుడ్డ లాగే గూడు కూడా మౌలిక అవసరమన్నది. చలికాలం రాబోతున్నందున పట్టణాల్లోని నిర్వాసితులకు తగిన ఆశ్రయం కల్పించాలని సూచించింది. 12 రాష్ర్టాలు తమ మార్గదర్శకాలను విస్మరించాయని గుర్తించిన ధర్మాసనం ఆయా ప్రభుత్వాలపై జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్, గోవా, మిజోరాం, మేఘాలయ, ఒడిశా, త్రిపుర రాష్ర్టాలకు రూ.లక్ష చొప్పున, హర్యానాకు రూ.5లక్షల జరిమానా విధించింది. ప్రకృతి వైపరీత్యాలతో సతమతమైన కారణంగా కేరళ, ఉత్తరాఖండ్ రాష్ర్టాలకు హెచ్చరికలతో సరిపెట్టింది. ఈ జరిమానాలను మూడువారాల్లోగా సుప్రీంకోర్టు న్యాయసేవా అథారిటీ వద్ద జమచేయాలని ఆదేశించింది. నిర్వాసితుల గుర్తింపు, వారికి ఆశ్రయ కల్పనపై అన్ని రాష్ర్టాలు అక్టోబర్ 31నాటికి యాక్షన్‌ప్లాన్ రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టే ఇవ్వలేం

ఎస్సీ,ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టానికి తాజాగా చేసిన సవరణలు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదంతో చట్టరూపం సంతరించుకున్నందున వాటి అమలుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని కొన్ని నిబంధనలను సడలిస్తూ, తక్షణ అరెస్టులనుంచి అమాయకులకు రక్షణ కల్పిస్తూ ఈ ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు తీర్పును చెప్పింది. దీనిపై దేశవ్యాప్తంగా దళితసంఘాలు ఆందోళనకు దిగడంతో కేంద్రం ఎస్సీ ఎస్టీ చట్టసవరణ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించింది. రాజ్యాంగ సవరణను దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్‌భూషణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. చట్టం ముందు అందరూ సమానమేనన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఇది ఉల్లంఘిస్తున్నదని పిటిషనర్ తరఫు న్యాయవాది పృథ్విరాజ్ చౌహాన్ తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన సవరణలు చట్టంలోకి చేరాయని, వాటి అమలును నిలుపుదల చేయడం ఈ దశలో సాధ్యంకాదని తెలిపింది. ఈ పిటిషన్లపై ఆరువారాల్లోగా తన స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

ఎక్కడికైనా వెళ్లాల్సిందే! సైనిక సిబ్బందికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఎక్కడ నియమించినా సైనికులు విధులు నిర్వర్తించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్మీ వైద్య సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది మినహా మిగతా యూనిట్ల సిబ్బంది తమను నియమించిన విభాగంలో విధులు నిర్వర్తించాల్సిందేనని జస్టిస్‌లు ఆర్‌ఎఫ్ నారిమన్, ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్ (ఏఎస్‌సీ) చెందిన ఒక మేజర్, ఒక లెఫ్టినెంట్ కల్నల్‌తోపాటు ముగ్గురు సైనిక సిబ్బంది తమ యూనిట్ నాన్ ఆపరేషనల్ యూనిట్ అని తమను పోరాట ప్రాంతాల్లో, పోరాట యూనిట్లలో నియమించడాన్ని సవాల్ చేశారు. కానీ వారి వాదనను వ్యతిరేకించిన కేంద్రం.. రెజిమెంటల్ డ్యూటీలో భాగంగానే వారిని బదిలీ చేశామన్నది. కేంద్రం వాదనతో ఏకీభవించిన ధర్మాసనం వారి పిటిషన్లను తోసిపుచ్చింది.

805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles