సం‘కుల’సమరంWed,January 11, 2017 01:05 AM

యాదవేతర ఓబీసీలు ఎవరి పక్షం?
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని ఓబీసీలు.. యాదవ్‌లు, దళిత సామాజికవర్గాల మధ్య అణచివేతకు గురవుతున్నామన్న భావనలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి నాయకత్వం వహిస్తున్న యాదవ్‌లకు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండడానికి వారు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఇక దళితులు బీఎస్పీకి బాసటగా నిలిస్తే.. బీజేపీతో అగ్రవర్ణాలు మమేకం అయ్యారు. కులాల ప్రాతిపాదికన ముందుకొచ్చిన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో చతికిలపడ్డ నేపథ్యంలో ఓబీసీలు తమ రాజకీయ ప్రాధాన్యం కోసం ప్రధాన పార్టీలు ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ మధ్య విడిపోయారు. ఆయా పార్టీల తాయిలాలు అందుకుని ఓట్లు వేస్తున్న నేప థ్యం ఉంది. వివిధ ప్రాంతాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా పార్టీల అభ్యర్థుల్లో తమ కులం వారు లేకపోతే బీజేపీకి ఓటేయడం ఆనవాయితీగా వస్తున్నది. సామాజిక వర్గ (కులాల) పొందికే ప్రధానంగా సాగుతున్న యూపీలో యాదవేతర ఓబీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఈ మూడు పార్టీలూ ఓబీసీలను తమ వైపుకు తిప్పుకునేందుకు తమదైన వ్యూహ రచనలతో ముందుకెళుతున్నాయి.

బీజేపీ, బీఎస్పీ తంటాలు


యాదవ్‌ల సారథ్యంలోని ఎస్పీ, దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీలకు ప్రతిగా ఓబీసీలకు తమ అక్కున చేర్చుకునేందుకు చర్యలు చేపట్టిన బీజేపీ.. రాజకీయంగా కీలకమైన కుర్మీ సామాజిక వర్గ నేత అనుప్రియ పటేల్‌కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది.పిఛ్‌డా వర్గ్ సమ్మేళన్ (బీసీ సదస్సు) పేరిట రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకటి చొప్పున 403 నియోజకవర్గాల పరిధిలో 200 ఓబీసీ సభలు నిర్వహించడం ద్వారా ఓబీసీల్లో తమ పట్టు పెంచుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. కాన్పూర్ - దెహత్ ప్రాంత కుష్వాహ సామాజిక వర్గానికి చెందిన ఓటరు మాటి ప్రసాద్ మౌర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ హమ్‌లోగ్ ఇస్‌బార్ బీజేపీకో ఓట్ దేంగే క్యోంకీ యాదవ్ పడేసాన్ కర్తా హై జబ్ ఎస్పీకి సర్కార్ ఆతీ హై, ఔర్ ఎస్సీ పడేసాన్ కర్తాహై జబ్ మాయావతి కీ సర్కార్ హై, హమ్ బీచ్‌వాలే జాయే తో కహా జాయే ఇస్ల్‌లియే బీజేపీకో ఓట్ దేంగే (మేం ఈసారి బీజేపీకి ఓటేస్తాం.ఎస్పీ అధికారంలో ఉంటే యాదవ్‌లు, మాయావతి అధికారంలో ఉంటే ఎస్సీలు మమ్మ ల్ని ఇబ్బంది పెడుతున్నారు. కనుక ఈ సారి బీజేపీకి ఓటేయాలని నిర్ణయించుకున్నాం) అని పేర్కొన్నాడు. లోద్, కుష్వాహాలు మినహా మిగతా సామాజిక వర్గాలకు నాయకత్వం వహించే వారే లేరు. తదనుగుణంగానే కుష్వాహా సామాజిక వర్గ నేత కేశవ్ ప్రసాద్ మౌర్యను రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నియమించడంతో ఇతర పార్టీలు ప్రత్యేకించి బీఎస్పీ ఓబీసీల విశ్వాసం చూరగొనేందుకు ప్రయత్నించింది. స్వామి ప్రసాద్ మౌర్య, ఓంప్రకాశ్ రాజ్‌బర్, సంజయ్ రాజ్‌బర్ వంటి నేతలను ముందు వరుసలో నిలిపి భాయిఛారా సమ్మేళనాలు (సోదర భావ సదస్సులు) జరిపింది. సుల్తాన్‌పూర్‌కు చెందిన కుమ్‌హార్ సామాజికవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతి స్పందిస్తూ హమారీ ఓట్ బదల్తీ రహ్తీ హై క్యోంకీ హమారీ కోయి అప్నా పార్టీ నహీ, హమారా ఏక్ హీ హిసాబ్ హై కీ జిదార్ లహర్ చాయి పడీ, ఉదర్ చత్ దియే (మాకు ఒక పార్టంటూ ఏమీ లేదు. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు మారుతుంటాం. ప్రజల నాడిని బట్టి మా వైఖరి మారుతుంది) అని చెప్పాడు. పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కహర్, కుమ్‌హర్, నిషాద్, రాజ్‌బర్ సామాజిక వర్గాలకు గణనీయ ఓటుబ్యాంక్ ఉంది. వీరంతా 1990 తర్వాత హిందుత్వ మండల్, బహుజన్ నినాదాల మధ్య విడిపోయారు.

రిజర్వేషన్ల వినియోగంలో విఫలం


1990వ దశకం నుంచి పాల్, నిషాద్, కహర్, కుమ్‌హర్, రాజ్‌భర్ తదితర ఓబీసీ కులాల వారు తమకు గల రిజర్వేషన్ల సౌలభ్యాన్ని సద్వినియోగంచేసుకోవడంలో విఫలమయ్యారు. రాజకీయంగా ఎదుగుతున్న యాదవ్‌లు, దళితులతో పోలిస్తే ఓబీసీలు పూర్తిగా వెనుకబడ్డారు. 2001 ప్రారంభంలో నాటి సీఎంగా ఉన్న ప్రస్తుత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వీరి కి ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పించేందుకు చేసిన ప్రయత్నాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. ఇది యాదవ్‌లకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని వా దించిన అప్పటి విపక్ష నేత, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం 2005లో పలు ఓబీసీ సామాజిక వర్గాలను ఎస్సీ క్యాటగిరీలో చేర్చాలని ప్రతిపాదించి.. బీఎస్పీ అధినేత మాయావతిని గందరగోళంలో పడేశారు. దాని కొనసాగింపుగానే 17 ఓబీసీ కులాలను ఎస్సీ క్యాటగిరీలో చేర్చాలని కేంద్రానికి సిఫారసుచేసిందీ యూపీ సర్కార్. తద్వారా ఓబీసీలను తమవైపుకు తిప్పుకోవాలని భావిస్తున్న బీజేపీనీ, దళితుల ఓట్లతో గద్దెనెక్కాలని భావిస్తున్న బీఎస్పీని డైలమాలో పడేసింది.

ప్రత్యేక రాష్ట్రం కోసం జాట్ల డిమాండ్


హరిత విప్లవం తర్వాత పశ్చిమ ప్రాంతంలో రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతమైన జాట్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇతర ప్రాంతాల వారితో పోలిస్తే మెరుగైన స్థానంలో కొనసాగుతున్నారు. అణచివేతకు గురయ్యామన్న భావనకు తోడు యాదవ్‌లు అధికారంలో ఉండటంతో వారికి కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలోనే చరణ్‌సింగ్ వారసులతోపాటు జాట్లు తమ పలుకుబడిని పెంచుకునేందుకు ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని కూడా ముందుకు తెచ్చారు.
- పీపుల్స్ పల్స్ సౌజన్యంతో..

495
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS