బీజేపీ, పీఎంకేతో అన్నాడీఎంకే పొత్తు


Wed,February 20, 2019 01:19 AM

Union Minister Piyush Goyal addresses media about BJP AIADMK alliance

-కమలనాథులకు 5 లోక్‌సభ సీట్లు
-పీఎంకేకి 7 లోక్‌సభ,ఒక రాజ్యసభ సీటు

చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాడులోని అధికార ఏఐఏడీఎంకే (అన్నా డీఎంకే) బీజేపీతోపాటు పీఎంకే (పట్టలి మక్కల్ కచ్చి)తో పొత్తు కుదుర్చుకున్నది. ఈ పొత్తులో భాగంగా బీజేపీ తమిళనాడులో 5 సీట్లకు పోటీ చేస్తుంది. ఏఐఏడీఎంకే సమన్వయకర్త, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం, కేంద్ర మంత్రి, బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇంచార్జి పీయూష్ గోయల్ మంగళవారం ఈ పొత్తును ప్రకటించారు. దీనిని మెగా కూటమిగా పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఏఐఏడీఎంకే, బీజేపీ మంగళవారం చెన్నైలో రెండవ, తుది దఫా చర్చలు జరిపిన తర్వాత ఈ పొత్తును కుదుర్చుకున్నాయి. ఈ చర్చల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పళనిస్వామి కూడా పాల్గొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తమిళనాడులో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది.

ఆ ఎన్నికల్లో కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పొన్ రాధాకృష్ణన్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పీఎంకేతో కూడా ఏఐఏడీఎంకే పొత్తు కుదుర్చుకున్నది. దీనిలో భాగంగా పీఎంకే మొత్తం 40 లోక్‌సభ స్థానాలకుగాను (కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఓ సీటు సహా) 7 స్థానాల్లో పోటీ చేస్తుందని, పీఎంకేకి ఓ రాజ్యసభ సీటును కూడా కేటాయించాలని నిర్ణయించామని పన్నీర్‌సెల్వం ప్రకటించారు. ఈ మేరకు ఒప్పందంపై మంగళవారం చైన్నైలోని ఓ హోటల్‌లో ఇరు పార్టీల నాయకులు సంతకాలు చేశారు. ఈ డీల్ ప్రకారం పీఎంకే రాష్ట్రంలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకి మద్దతిస్తుందని పన్నీర్‌సెల్వం తెలిపారు. ఇది ప్రజల సంక్షేమం కోసం పాటుపడే మెగా కూటమి అని, వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం తథ్యమని పీఎంకే వ్యవస్థాపక నేత ఎస్ రామ్‌దాస్ పేర్కొన్నారు.

404
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles