నాయకులకు గుడ్డిగా తలూపకండిFri,April 21, 2017 02:05 AM

ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సూచన
న్యూఢిల్లీ: తప్పుడు ఆదేశాలు ఇచ్చే రాజకీయ నాయకులను ప్రశ్నించాలని, వారికి గుడ్డిగా తల ఊపరాదని ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు. నిర్ణయాలు తీసుకోవడంలో సివిల్ సర్వీసు అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని, దేనికీ సంకోచించరాదని చెప్పారు. గురువారం సివిల్ సర్వీసుల దినోత్సవం సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
rajnatha
రాజకీయ నాయకులు మీకు తప్పుడు ఆదేశాలు ఇస్తే, వారితో నియమనిబంధనల గురించి మాట్లాడడానికి భయపడవద్దు. మీరు తప్పు చేస్తున్నారని వారికి నిర్భయంగా చెప్పండి. గుడ్డిగా ఫైలు మీద సంతకం పెట్టి మీ అంతరాత్మను మోసం చేసుకోవద్దు అని మంత్రి హితవు పలికారు. సమాజంలో మార్పు తేవడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. అధికారంతోపాటు బాధ్యత, జవాబుదారీతనం వస్తాయని, కాబట్టి ఉద్యోగులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. సరైన నిర్ణయాలు తీసుకోని అధికారులను ఆయన విమర్శించారు. నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచిస్తే దేశ ప్రయోజనాలకు హాని కలుగుతుందని అన్నారు. సివిల్ సర్వీసులు దేశానికి వెన్నెముక అని మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ అన్నమాటను ఆయన గుర్తుచేశారు. కార్యక్రమంలో ఐఏఎస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

417

More News

VIRAL NEWS