ఉద్ధవ్‌కు పగ్గాలు

Sat,November 23, 2019 03:37 AM

- మహారాష్ట్రలో కొలిక్కివచ్చిన సంకీర్ణం
- ఠాక్రేకు సీఎం పదవి.. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన ఏకగ్రీవ ఆమోదం
- ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ వెల్లడి

ముంబై, నవంబర్‌ 22: మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కూటమి గద్దెనెక్కేందుకు సిద్ధమయ్యాయి. ఎడతెరపిలేకుండా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనున్నదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ శుక్రవారం స్వయంగా ప్రకటించారు. శనివారం మరోసారి చర్చించిన అనంతరం మూడు పార్టీల ప్రతినిధులు సంయుక్తంగా మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన శనివారం లేదా ఆదివారం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మహారాష్ట్రలో రూపుదిద్దుకున్నది స్వార్థపూరిత కూటమి అని, రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలన అందించలేదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ విమర్శించారు.

మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ శుక్రవారం ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర వికాస కూటమి గద్దెనెక్కే అవకాశాలున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం ముంబైలో కీలక సమావేశం నిర్వహించారు. శనివారం కూడా చర్చలు కొనసాగుతాయి. అనంతరం మూడు పార్టీల ప్రతినిధులు సంయుక్తంగా మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.
uddhav-thackeray1

రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించాం

శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శివసేన నుంచి ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, కీలక నేతలు ఏక్‌నాథ్‌ షిండే, సంజయ్‌ రౌత్‌, సుభాష్‌ దేశాయ్‌, ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ నుంచి అధ్యక్షుడు శరద్‌పవార్‌, నేతలు ప్రఫుల్‌ పటేల్‌, జయంత్‌ పాటిల్‌, అజిత్‌ పవార్‌, కాంగ్రెస్‌ నుంచి మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, అవినాశ్‌ పాండే, బాలాసాహెబ్‌ థొరాట్‌, పృథ్వీరాజ్‌ చౌహాన్‌ తదితరులు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు సమావేశం ప్రారంభమై రెండు గంటలపాటు కొనసాగింది. కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)ముసాయిదా, మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై ప్రధానంగా చర్చించారు. దాదాపు అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారని, ‘మహారాష్ట్ర వికాస కూటమి’కి తుదిరూపు ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం శరద్‌పవార్‌ మీడియాతో మాట్లాడుతూ ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడబోతున్నదని తెలిపారు. ‘అనేక అంశాలపై విస్తృతంగా చర్చించాం. సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రేను ఏకగ్రీవంగా ఎంపిక చేశాం. చర్చలు శనివారం కూడా కొనసాగుతాయి. తర్వాత మూడుపార్టీల ప్రతినిధులు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తారు. గవర్నర్‌ను ఎప్పుడు కలువాలో కూడా రేపే నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు.

ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. ఈ సమావేశంలో మహారాష్ట్ర భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చర్చలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగాయన్నారు. కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ శనివారం కూడా చర్చలు కొనసాగుతాయని తెలిపారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మరోసారి సమావేశం అవుతామని, చర్చల సారాంశాన్ని ఆమెకు వివరిస్తామన్నారు. మంత్రి పదవులపై అప్పడే నిర్ణయిస్తారని వెల్లడించారు. తమ సమావేశంలో సీఎం పీఠాన్ని శివసేన, ఎన్సీపీ పంచుకోవాలనే ప్రతిపాదనేదీ రాలేదని శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. సీఎం గా బాధ్యతలు చేపట్టడానికి ఉద్ధవ్‌ ఠాక్రే అంగీకరించారని సంజయ్‌రౌత్‌ ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలు తమ కూటమిలోని ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ తదితర పార్టీల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. బీజేపీకి అధికారం దక్కకుండా.. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయా పార్టీలు ఒప్పుకొన్నాయని ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ తెలిపారు. మూడుపార్టీల నేతలు శనివారం లేదా ఆదివారం గవర్నర్‌ను కలువొచ్చని సమాచారం.

చాణక్యుడిని పవార్‌ ఓడించారు

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైన నేపథ్యంలో ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ పరోక్షంగా అమిత్‌షాను ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు. ‘భారత రాజకీయాల్లో చాణక్యుడిగా (అమిత్‌ షా) చెప్పుకొనే వ్యక్తిని శరద్‌పవార్‌ ఓడించారు. ఢిల్లీ సింహాసనం మహారాష్ట్ర ప్రజల మెడలను వంచలేదు’ అని శుక్రవారం ట్వీట్‌ చేశారు. మరోవైపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ‘అపవిత్రమైన పొత్తు’ పెట్టుకుంటున్నాయని, వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వారు అధికారంలోకి వస్తే ప్రజాతీర్పు ను అగౌరవపరిచినట్టేనని సురేంద్ర ఇంద్రబహదూర్‌ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

గవర్నర్‌ ఢిల్లీ పర్యటన రద్దు

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్న దృష్ట్యా గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. రెండు రోజులపాటు జరిగే గవర్నర్ల వార్షిక సమావేశం శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. దీనికి హాజరయ్యేందుకు గవర్నర్‌ గురువారం బయలుదేరాల్సి ఉండగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రద్దు చేసుకున్నారని రాజ్‌భవన్‌ తెలిపింది.
uddhav-thackeray2

16+14+12 ఫార్ములా?

మంత్రి పదవుల్లో 16+14+12 ఫార్ములాకు మూడు పార్టీలు ప్రాథమికంగా అంగీకరించినట్టు సమాచారం. శివసేనకు సీఎంతోపాటు 16 పదవులు, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 పదవులు దక్కనున్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉన్నది. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ వంటి మిగతా పదవులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆదిత్య ఠాక్రేకు విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు శివసేన తన ఎమ్మెల్యేలను ముంబైలోని ఓ హోటల్‌కు తరలించింది.
uddhav-thackeray3
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమికి స్వార్థమే పునాది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో సైద్ధాంతికంగా బద్ధవిరోధులైన పార్టీలు పొత్తు కుదుర్చుకుంటున్నాయి. ఒకవేళ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా 6-8 నెలలకు మించి కొనసాగదు. రాజకీయాల్లో.. క్రికెట్‌లో ఎప్పుడైనా, ఏమైనా జరుగొచ్చు (బీజేపీ మళ్లీ అధికారంలోకి రావొచ్చనే ఉద్దేశంలో..).
- గడ్కరీ, కేంద్ర మంత్రి

1848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles