జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు వాయుసేన కమెండోలు మృతిThu,October 12, 2017 02:08 AM

ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
forces-guard
శ్రీనగర్, అక్టోబర్ 11: జమ్ముకశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమవగా భారత వాయుసేనకు చెందిన ఇద్దరు కమెండోలు వీరమరణం పొందారు. ఉగ్రవాదుల ఉనికిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు తెల్లవారుజామున బండిపొర జిల్లాలోని హజిన్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఐఏఎఫ్ గరుడ కమెండోలు సార్జెంట్ మిలింద్ కిశోర్, కార్పొరల్ నీలేశ్‌కుమార్‌గా 92 బేస్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఒకడు పాకిస్థాన్‌కు చెందిన అలీ అలియాస్ అబు మాజ్ కాగా, మరొకడు స్థానిక ఉగ్రవాది నశ్రుల్లా మిర్‌గా గుర్తించినట్టు డీజీపీ ఎస్పీ వేద్ తెలిపారు. రెండు ఏకే రైఫిల్స్, ఒక పిస్తోల్, హ్యాండ్ గ్రెనేడ్, 12 ఏకే మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను బుధవారం అరెస్టు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

171

More News

VIRAL NEWS