జడ్జీల తిరుగుబాటు!


Sat,January 13, 2018 03:31 AM

Turmoil in Supreme Court as four judges speak out against Chief Justice Dipak Misra

న్యాయ సంక్షోభం!
ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు

-దేశచరిత్రలో తొలిసారిగా మీడియాకెక్కిన నలుగురు న్యాయమూర్తులు
-సర్వోన్నత న్యాయస్థానం పాలనావ్యవస్థ సక్రమంగా లేదని వెల్లడి
-చీఫ్ జస్టిస్ అభిశంసనపై నిర్ణయం తీసుకోవాల్సింది దేశ ప్రజలేనని వ్యాఖ్య
-బహిరంగలేఖ రాసిన ధిక్కార న్యాయమూర్తులు

chalameshwar
న్యూఢిల్లీ, జనవరి 12: భారత న్యాయవ్యవస్థలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దృశ్యం శుక్రవారం ఆవిష్కృతమైంది. కొంతకాలంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కొందరు న్యాయమూర్తులకు మధ్య కొనసాగుతున్న విభేదాలు ఒక్కసారిగా బహిరంగమయ్యాయి. భారత న్యాయ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై అసహనం వ్యక్తంచేశారు. సుప్రీం పాలనావ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. చీఫ్ జస్టిస్ తర్వాత సుప్రీంకోర్టులో రెండవ సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్.. తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన కీలక సమావేశంలో న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, ఎంబీ లోకూర్, కురియన్ జోసెఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్.. తమ చర్యను దేశ చరిత్రలోనే అసాధారణ ఘటనగా పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఇలా మాట్లాడాల్సి వస్తున్నదని, దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయని జస్టిస్ చలమేశ్వర్ చెప్పారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక న్యాయవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. సర్వోన్నత న్యాయస్థానం పవిత్రతను కాపాడకపోవడం ప్రజాస్వామ్యానికి చేటు. గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ పరిణామాలపై నాలుగునెలలక్రితం కొలీజియంలోని నలుగురు జడ్జీలం చర్చించుకుని ప్రధానన్యాయమూర్తికి సంతకాలతో లేఖ రాశాం. సుప్రీంకోర్టు పాలనావ్యవహారాలు సరైన పద్ధతిలో జరుగడం లేదని చెప్పాం. సరిదిద్దాలని కోరాం. కానీ, నిర్దేశిత విధానాల ప్రకారం వెళ్లడానికి చీఫ్ జస్టిస్ అంగీకరించడం లేదు. ఈరోజు ఉదయం కూడా ప్రధానన్యాయమూర్తిని కలిసినా ఫలితం లేకపోయింది. ఆయనను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం. అందుకే జరుగుతున్న పరిణామాలను నేరుగా ప్రజలకు చెప్పడం తప్ప మా ముందు మరోమార్గం లేదు. అందుకే మీడియా ఎదుటకు వచ్చాం. ఇలా సమావేశం పెట్టడం అత్యంత బాధాకరమే అయినా.. తప్పలేదు. మీరు నలుగురూ మీ ఆత్మల్ని ఆమ్ముకున్నారని 20 ఏండ్ల తర్వాత ఎవరైనా మావైపు వేలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. సుప్రీంకోర్టు వ్యవస్థకు, దేశానికి మేం బాధ్యులం. అందుకే జరుగుతున్న పరిణామాలపై దేశప్రజలకు పూర్తి వివరాలు తెలియజేస్తూ మేం మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం అని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించాలని మీరు కోరుతున్నారా అని మీడియా అడుగగా, అభిశంసన కోరడానికి తామెవరమని, అది నిర్ణయించాల్సింది ప్రజలేనని న్యాయమూర్తులు తెలిపారు. మిమ్మల్ని బాధించిన అంశాలేమిటని ప్రశ్నించగా.. న్యాయమూర్తులకు కేసుల కేటాయింపుతో సహా.. చాలా సమస్యలున్నాయి అని సమాధానమిచ్చారే తప్ప ఆ సమస్యలేమిటో వెల్లడించలేదు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు పంపిన ఏడు పేజీల లేఖను న్యాయమూర్తులు మీడియాకు విడుదల చేశారు. నలుగురు జడ్జిల మీడియా సమావేశం న్యాయవ్యవస్థలో కలకలం రేపగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామం జరిగిన వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను పిలిపించుకుని చర్చించారు. న్యాయమూర్తుల చర్య నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది ఉత్కంఠను రేపుతున్నది.
chalameshwar1

మీడియా సమావేశం పెట్టాల్సింది కాదు: ఏజీ

భిన్నాభిప్రాయాలు తొలిగేందుకు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తులు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నట్లు అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ చెప్పారు. న్యాయమూర్తులు మీడియా సమావేశం పెట్టకుండా ఉండాల్సిందని, వ్యవహారాన్ని సానుకూలంగా చర్చించుకుంటే సరిపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రాతో భేటీ అనంతరం ఏజీ విలేకరులతో మాట్లాడారు. న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్.. అభిప్రాయ భేదాలను పక్కనబెట్టి భవిష్యత్ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. సంక్షోభానికి త్వరలోనే తెరపడుతుందని అన్నారు.

వివాదానికి కారణమైన అంశాలు

1)కీలకమైన కేసుల విచారణను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనాలే చేపడుతున్నాయని, మిగతా సీనియర్ జడ్జిలకు కేటాయించడం లేదని నలుగురు న్యాయమూర్తులు భావిస్తున్నారు.
2)దేశాన్ని, న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే ముఖ్యమైన కేసులను క్రమపద్ధతిలోకాకుండా, కొందరు ఎంపిక చేసిన న్యాయమూర్తులు ఉండే ధర్మాసనాలకే చీఫ్‌జస్టిస్ కేటాయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
3)సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ లోయా అనుమానాస్పద మృతిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీనియర్ న్యాయమూర్తులున్న మొదటి నాలుగు ధర్మాసనాలకు కాకుండా, నేరుగా కోర్టు నెం.10కి కేటాయించడం
4)న్యాయమూర్తుల పేరిట లంచాలు తీసుకున్నారన్న అభియోగాలు వచ్చిన వైద్యప్రవేశాల కుంభకోణం కేసు విచారణకు ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జస్టిస్ చలమేశ్వర్ ప్రకటించారు. ఆ తీర్పును రద్దు చేసిన చీఫ్ జస్టిస్ కేసును కోర్టు నెం.7లోని మరో ధర్మాసనానికి కేటాయించారు. ఈ కేసులో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలున్నాయి.
5)ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించిన కేసును.. కార్యసరళి జాబితా ద్వారా ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలను ఏర్పాటు చేసుకుని సీజేఐ విచారించడాన్ని వారు తప్పుపట్టారు.

జస్టిస్ చలమేశ్వర్

justice-chelameshwar
భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై తిరుగుబాటు ప్రకటించినంత పనిచేసిన జస్టిస్ చలమేశ్వర్.. దేశంలోని న్యాయమూర్తుల్లో కెల్లా సీనియారిటీలో రెండోస్థానంలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం కావడంలో జాప్యమైంది. అందువల్ల ఆయన ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయారు. జస్టిస్ చలమేశ్వర్ తెలుగువారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా మొయ్య మండలంలోని పెద్దముత్తేవి గ్రామంలో 1953 జూన్ 23న జన్మించారు. మచిలీపట్నంలో హైస్కూలు చదువుల తరువాత మద్రాసుకు వెళ్లి అక్కడి లయోలా కాలేజీలో ఫిజిక్స్‌లో డిగ్రీ చేశారు. 1976లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకుని న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు.1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) అయ్యారు. 1999 మేలో ఏపీ హైకోర్టు అదనపు జడ్జి అయ్యారు. 2007లో అస్సాం హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. అనంతరం కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవిని చేపట్టి, 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ఈ ఏడాది జూన్ 2న రిటైర్ కానున్నారు. జడ్జీల ఎంపికకు ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేసి జాతీయ న్యాయనియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేయాలని వాదించిన ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్. ఎన్‌జేఏసీ ఏర్పాటు ప్రతిపాదనను రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసినా, ఆ ధర్మాసనంలో ఉండి ఎన్‌జేఏసీకి అనుకూలంగా మాట్లాడింది ఆయన ఒక్కరే. తన అభిప్రాయానికి భిన్నంగా కొలీజియం వ్యవస్థే కొనసాగుతుండటంతో ఆయన కొలీజియం సమావేశాల్లో పాల్గొనడం లేదు. 2015లో సెక్షన్ 66ఏ చెల్లుబాటుపై తీర్పు ఇచ్చినవారిలో చలమేశ్వర్ కూడా ఉన్నారు. ఆధార్ కేసులో గోప్యతహక్కు అనేది ప్రాథమిక హక్కు అనే అంశంపై విచారణకు ఆయన నేతృత్వంలోనే ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటైంది. ఆధార్ కార్డు లేనంత మాత్రాన ప్రభుత్వ సబ్సిడీలను నిరాకరించడం తగదని తాజాగా ఆదేశించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ చలమేశ్వర్ ఉన్నారు.

జస్టిస్ కురియన్ జోసెఫ్

Justice_KurianJoseph
కురియన్ జోసెఫ్ కేరళలో 1953 నవంబర్ 30న జన్మించారు. త్రివేండ్రంలో న్యాయశాస్త్రం అభ్యసించి 1979 నుంచి న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. 1994-1996 మధ్య అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. 2001లో కేరళ హైకోర్టు జడ్జిగా, 2010లో హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్జిస్‌గా, 2013 మార్చి3న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ట్రిపుల్ తలాక్‌పై ఇచ్చిన తీర్పులో చీఫ్‌జస్టిస్ అభిప్రాయానికి భిన్నంగా స్పందించారు. బొగ్గు కుంభకోణం, అఫ్జల్‌గురు కేసుల్ని విచారించిన ధర్మాసనాల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.

జస్టిస్ రంజన్ గొగోయి

ustice-ranjangogoi
అసోంకు చెందిన జస్టిస్ రంజన్ గొగోయి 1954 నవంబర్ 18న జన్మించారు. అసోం మాజీ ముఖ్యమంత్రి కేశబ్‌చంద్ర గొగోయి కుమారుడు. 1978లో బార్ అసోసియేషన్‌లో పేరు నమోదుచేసుకున్న రంజన్ గొగోయి.. 2001లో గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011లో పంజాబ్-హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. జస్టిస్ దీపక్ మిశ్రా తర్వాత అనుభవజ్ఞులైన రంజన్ గొగోయి ఈ ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉన్నది.

జస్టిస్ మదన్ బీ లోకూర్

madan-b-lokur
జస్టిస్ మదన్ భీమ్‌రావు లోకూర్ 1953 డిసెంబర్ 31న జన్మించారు. న్యూఢిల్లీలో ఆయన విద్యాభ్యాసం జరిగింది. మదన్ బీ లోకూర్ 1977లో న్యాయవాదిగా చేరిన ఆయన సుప్రీంకోర్టుతోపాటు ఢిల్లీ హైకోర్టులో పనిచేశారు. 1999లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ, గువాహటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జూన్ 4న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఓబీసీ కోటా (27శాతం) నుంచి మైనార్టీలకు 4.5 శాతం సబ్ కోటా కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన వారిలో లోకూర్ ఒకరు. మైనింగ్ కుంభకోణం కేసులో లంచం ఆరోపణలపై ప్రత్యేక సీబీఐ జడ్జిని తొలగించారు.

1065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS