ఎంపీ నుస్రత్‌పై మత పెద్దల ఆగ్రహం

Tue,October 8, 2019 03:43 AM

-పేరు, మతం మార్చుకొంటే ఇబ్బందిలేదన్న ముఫ్తీ అసద్ ఖాస్మీ
-భర్త నిఖిల్‌జైన్‌తో కలిసి దుర్గామాత పూజల్లో పాల్గొనడంపై మండిపాటు

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ దుర్గాపూజలో పాల్గొనడంపై ముస్లిం మతపెద్దలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నుస్రత్ తీరును దారుల్ ఉలూం దేవబంద్‌కు చెందిన మతపెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం మహిళ బొట్టు, మంగళసూత్రం ధరించి హిందూ దేవతలకు పూజలు చేయడం ముస్లిం మతాచారం కాదు. ఇస్లాం తన అనుచరులు అల్లాహ్‌ను మాత్రమే ప్రార్థించాలని ఆదేశిస్తున్నది. ఒకవేళ ఎంపీ జహాన్ పూజలు చేయాలనుకొంటే పేరు, మతం మార్చుకొంటే మాకెలాంటి అభ్యంతరం లేదు అని దారుల్ ఉలూం దేవబంద్‌కు చెందిన ముఫ్తీ అసద్ ఖాస్మీ చెప్పారు. మరోవైపు నుస్రత్ జహాన్ పూజలు చేయడంలో తప్పేమీ కనిపించడం లేదని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షియా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వాసీం రిజ్వీ సమర్ధించారు.

హిందువును పెండ్లి చేసుకొన్న జహాన్‌కు తన ఇష్టానుసారం హిందూ మతానికి చెందిన బొట్టు, మంగళసూత్రం ధరించే హక్కు ఉన్నదన్నారు. నుదుట సింధూరం, చీర ధరించి జూన్ 25న ఎంపీగా నుస్రత్ జహాన్ లోక్‌సభలో ప్రమాణం చేయడంపై కూడా ముస్లిం మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తర్వాత తొలిసారి జరుపుకొంటున్న దసరా శరన్నవరాత్రి సందర్భంగా కోల్‌కతా లో భర్త నిఖిల్‌జైన్‌తో కలిసి సురుచి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన దుర్గా పూజలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దుర్గాష్టమి వేడుకల్లో సంగీత వాయిద్యమైన ధాక్ వాయించి అందరినీ ఆకట్టుకొన్నారు.

350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles