తిత్లీ బీభత్సం


Fri,October 12, 2018 01:56 AM

Titli moving towards Odisha and Andhra Pradesh coasts

-ఏపీ, ఒడిశాలోపెను విధ్వంసం
-భారీ వర్షాలు, ఈదురు గాలులతో ఎనిమిది మంది మృతి
-నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
-ముందుజాగ్రత్త చర్యలతో ఒడిశాలో తగ్గిన నష్టం
-సురక్షిత ప్రాంతాలకు మూడు లక్షల మంది

తిత్లీ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో పెను బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుఫానుగా మారి గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో తీరాన్ని దాటింది. ఆ ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాలు, ఈదురు గాలులతో ఏపీ, ఒడిశాలో అపార ఆస్తి నష్టం సంభవించింది.. వేల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొబ్బరి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వేల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏపీలో ఎనిమిది మంది చనిపోయారు. రైల్వే శాఖ ముందుగానే కొన్ని రైళ్లను రద్దు చేయగా, ఒడిశాలో ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తినష్టం జరిగింది. దాదాపు మూడు లక్షల మందిని ముందుగానే పునరావాస శిబిరాలకు తరలించారు. తుఫాన్ ప్రభావంతో మరో 24 గంటలపాటు ఒడిశా, ఏపీలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణలో తుఫాన్ ప్రభావం లేకున్నా ద్రోణి కారణంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అమరావతి/భువనేశ్వర్, అక్టోబర్ 11: బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుఫాను ఊహించినట్టుగానే పెను విధ్వంసం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో అపార నష్టం కలుగజేసింది. గురువారం ఉదయం 4.45 గంటలకు శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో తుఫాను తీరాన్ని తాకిందని వాతావరణ విభాగం తెలిపింది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో ఏపీలో ఎనిమిదిమంది మృతిచెందగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. చెట్టు కూలి ఒకరు, ఇల్లు కూలి ఒకరు మరణించగా, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు కూడా మరణించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సముద్రంలోకి వెళ్లిన 67 మత్స్యకారుల పడవల్లో 65 తిరిగి వచ్చాయని, మరో రెండింటి కోసం గాలిస్తున్నామని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు, విద్యుత్ వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది.

ఈదురు గాలుల కారణంగా రెండువేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బుధవారం రాత్రి నుంచి 4,319 గ్రామాలు, ఆరు పట్టణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూలిన కారణంగా చెన్నై, కోల్‌కతా మధ్య జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా రైల్వే శాఖ కొన్ని రైళ్లు రద్దుచేసి, మరికొన్నింటిని దారి మళ్లించింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పంట నష్టం భారీగా సంభవించినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా కొబ్బరి, అరటి, మామిడి చెట్లు అధిక సంఖ్యలో కూలిపోగా, వరి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2014లో వచ్చిన హుద్‌హుద్ తుఫాను కంటే తిత్లీ నష్టం ఎక్కువగా ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 23 నుంచి 28 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈశాన్య దిశగా కదులుతున్న తుఫాను శుక్రవారం బలహీనపడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతోపాటు, ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది.
iToofan-people-reloca

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు

తిత్లీ తుఫాను ప్రభావం తెలంగాణపై లేకున్నా ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.

ఒడిశాలో 8 జిల్లాలు ప్రభావితం

ఒడిశాలో తిత్లీ తుఫాను కారణంగా ఎనిమిది జిల్లాలు ప్రభావితమయ్యాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. తీర ప్రాంత జిల్లాల్లోని మూడు లక్షల మందిని ప్రభుత్వం ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కాగా పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, పెంకుటిండ్లు, గుడిసెలు కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. గంజాం, గజపతి, పూరి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయని, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్వల్పంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. భారీ ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగిన సమాచారమేదీ అందలేదని, ప్రత్యేక కమిషనర్ బీపీ సేథీ చెప్పారు. తాము ఊహించిన దానికన్నా నష్టం తక్కువగా ఉన్నదని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ పాడి చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు 1,112 శిబిరాల్లో ఆశ్రయం కల్పించామని, గర్భిణీలను దవాఖానల్లో చేర్చామని తెలిపారు. తీరాన్ని తాకిన అనంతరం తుఫాను ఈశాన్యం దిశగా కదులుతున్నప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో గురువారం ఆ ప్రభావం కనిపించలేదు.

హరికేన్ మైఖేల్‌తో ఫ్లోరిడా అస్తవ్యస్తం!

ఒకరు మృతి, భారీ విధ్వంసం
పనామా సిటీ: ఫ్లోరిడాలో తీరం దాటిన హరికేన్ మైఖేల్ పెను విధ్వంసం మిగిల్చింది. ఈ క్యాటగిరీ-4 తుఫాను ప్రభావంతో గంటకు 155మైళ్ల వేగంతో వీస్తున్న ఈదు రుగాలులకు తోడు భారీ వర్షాలు కురవడంతో గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం పరిధిలోని ఇండ్లు, వీధులన్నీ వరద నీటితో మునిగిపోగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. ఫ్లోరిడా రాజధాని తెల్హస్సీలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మెక్సికో బీచ్ వెంబడి కొన్ని ఇండ్ల పునాదులు, పై కప్పులు లేచిపోయాయి. 1851 తర్వాత ఫ్లోరిడాలో అత్యంత తీవ్రమైన హరికేన్ ఇదేనని అధికారులు తెలిపారు. 20కి పైగా కౌంటీల పరిధిలో 3.75 లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితి విధిస్తు న్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిం చారు. హరికేన్ కదలికల్ని బట్టి వాతావరణ విభాగం తాజాగా అలబామా, జార్జియా రాష్ర్టాలకు విపత్తు హెచ్చరికలను జారీ చేసింది.
Toofan-Overturned

1690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles