మాలిక్‌కే ఎల్జీ బాధ్యతలు!

Wed,October 23, 2019 03:02 AM

-జమ్ముకశ్మీర్, లఢక్‌ల లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఆయననే నియమించే ఛాన్స్
-ప్రస్తుతం జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్

శ్రీనగర్, అక్టోబర్ 22: జమ్ముకశ్మీర్‌కు ప్రస్తుత గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను.. అక్టోబర్ 31న ఏర్పడనున్న జమ్ముకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా (ఎల్జీ) ప్రభుత్వం నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే రోజున ఆయన పదవీబాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ పదవికి మరికొంత మంది పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని, నిర్ణయం త్వరలోనే వెలువడవచ్చని తెలిపాయి. అయితే, జమ్ముకశ్మీర్‌కు గత ఏడాదిగా గవర్నర్‌గా సేవలందిస్తున్న మాలిక్‌కు అక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఎల్జీ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని ప్రభుత్వం భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం గవర్నర్‌కి సలహాదారులుగా ఉన్న అధికారులు తమతమ పదవుల్లో కొనసాగుతారో, లేదో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆర్టికల్ 370ను రద్దు చేశాక, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా(జమ్ముకశ్మీర్, లఢక్) విభజిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొనడం తెలిసిందే. అక్టోబర్ 31 నుంచి ఆయా ప్రాంతాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి రానున్నది. దీంతో కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్ముకశ్మీర్, లఢక్‌లోని శాంతి భద్రతలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఎల్జీ ఆదేశాలను పోలీసులు పాటించనున్నారు.

కశ్మీరీ యువకుల్ని బలి చేశారు!

జమ్ముకశ్మీర్‌లోని వేర్పాటువాదులు, పార్టీ నాయకులు, మతాధిపతులు తమ బోధనలతో అమాయకులైన కశ్మీరీ పిల్లలను ప్రభావితం చేసి వాళ్ల జీవితాల్ని బలిగొంటున్నారని ఆ రాష్ర్ట గవర్నర్ సత్యపాల్ మాలిక్ విరుచుకుపడ్డారు. అయితే, ఆయా నాయకుల కుటుంబాలు మాత్రం బాగుపడ్డాయని మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని కత్రా పట్టణంలో ఉన్న మాతా వైష్ణోదేవి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని సంపన్న, శక్తివంతమైన కొన్ని కుటుంబాలు సాధారణ కశ్మీరీ యువకుల ఆకాంక్షలను చిదిమేసి, వాళ్ల ప్రాణాల్ని తీశాయన్నారు. అయితే వాళ్ల కొడుకులు, కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని స్థిరపడ్డారని అన్నారు. ఉగ్రవాదంలోకి వాళ్ల పిల్లలెవరూ వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా కశ్మీరీ ప్రజలు నిజాల్ని అర్థం చేసుకొని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ.. రాష్ర్టంలో శాంతి, అభివృద్ధి స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కశ్మీరీ ముస్లింలకు రెండు స్వర్గాలు ఉన్నాయని మాలిక్ తెలిపారు. మీరు నివసిస్తున్న కశ్మీర్ ఒక స్వర్గం. నిజమైన ముస్లింగా చనిపోయాక ప్రాప్తించేది మరో స్వర్గం అని అన్నారు. దేశంలో గవర్నర్ల పరిస్థితి చాలా బలహీనంగా ఉన్నదని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles