మంచి మార్పులు తీసుకొస్తాSun,August 13, 2017 01:18 AM

సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్ ప్రసూన్‌జోషి
PrasoonJoshi
న్యూఢిల్లీ, ఆగస్టు 12: తన విధులను నిర్మాణాత్మకంగా సానుకూలంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని సెన్సార్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రసూన్‌జోషి అన్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న మాజీ చైర్మన్ నిహలానీ స్థానంలో జోషీని కేంద్రప్రభుత్వం నియమించింది. మంచి ఉద్దేశంతో విధులను ప్రారంభిస్తున్నానని, సానుకూల మార్పును సాధించేందుకు అనుభవజ్ఞుల సహకారం తీసుకుంటానని ఆయన తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చైర్మన్‌గా నియమితులైన ప్రసూన్ జోషి రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రసిద్ధ సినీ గీతరచయిత. ఆయన మూడేండ్లపాటు లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వం కొత్త సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది.

ఇందులో విద్యాబాలన్, వివేక్ అగ్నిహోత్ర, గౌతమి తడిమళ్ల, నరేంద్ర కోహ్లి, నరేశ్ చంద్రలాల్, నీల్ హెర్బెర్ట్, వామన్ కెండ్రె, టీఎస్ నాగభరణ, రమేశ్ పటాంజే, వాణి త్రిపాఠి, జీవిత రాజశేఖర్, మిహిర్ సభ్యులుగా ఉన్నారు. బోర్డు సభ్యుల వివరాలను ప్రకటించిన అనంతరం జోషి ముంబైలో మీడియాతో మాట్లాడుతూ బోర్డులో మంచి వ్యక్తులు సభ్యులుగా ఉండటం శుభపరిణామం. మేమంతా కలిసి గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చూస్తాం. కొత్త మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుంటాం అని చెప్పారు. జోషి ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో జన్మించారు. ఆయన రాసిన తారే జమీన్ పర్ చిత్రంలోని మా, చిట్టగాంగ్‌లోని బోలో నా, బాగ్ మిల్కా బాగ్ చిత్రంలోని జిందా పాటలు ప్రసిద్ధి పొందాయి. 2015లో జోషి పద్మశ్రీ అందుకున్నారు.

176

More News

VIRAL NEWS