వరద బీభత్సం


Sun,August 13, 2017 02:06 AM

The floods in Nepal, China, along with Tripura in India

త్రిపురలో నిరాశ్రయులయిన 4500 కుటుంబాలు
Nepal
అగర్తలా, ఆగస్టు 12: భారత్‌లోని త్రిపురతోపాటు నేపాల్, చైనాలో శనివారం వరదలు బీభత్సం సృష్టించాయి. త్రిపురలోని మూడుజిల్లాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. వర్షాల వల్ల ఆకస్మిక వరదలు రావడంతో దాదాపు 4500 కుటుంబాలు నిరాశ్రయులైనట్టు అధికారవర్గాలు తెలిపాయి. రెండువేలకు పైగా కుటుంబాలకు రాష్ట్ర రాజధానిలోని వివిధ ప్రభుత్వ భవనాల్లో ఆశ్రయం కల్పించారు. పశ్చిమ త్రిపుర కలెక్టర్ మిలింద్ రామ్‌తెకేతో కలిసి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి బాదల్ చౌదరి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. హౌరానది వంతెన వద్ద శుక్రవారం ఏర్పడ్డ లీకేజీలను వెంటనే మరమ్మతు చేయించినట్టు మంత్రి చెప్పారు. హౌరా నదిలో ప్రమాదకరస్థాయికి మించి నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు. ఖోవాయి జిల్లాలోని చాలాప్రాంతాలు నీట మునిగాయని బాదల్ చౌదరి పేర్కొన్నారు.


అస్సోంలో వరద పరిస్థితులు తగ్గుముఖం

అస్సోంలో వరద పరిస్థితులు తగ్గుముఖం పట్టినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎస్డీఎమ్‌ఏ) శనివారం ఒక నివేదికలో తెలిపింది. 19జిల్లాల్లోని సుమారు 11 లక్షల ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. ఈ ఏడాది వరదల వల్ల జరిగిన ప్రమాదాల్లో 89మంది మృతి చెందారు. ప్రస్తుతం 1752 గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. లక్ష ఎకరాల పంట నష్టం సంభవించింది. వరదల వల్ల పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు సుమారు 2,600మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి అని ఏఎస్డీఎమ్‌ఏ తన నివేదికలో వివరించింది.

నేపాల్‌లో 36 మంది మృతి

నేపాల్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో సుమారు 36 మంది మృత్యువాతపడ్డట్టు శనివారం అధికారులు తెలిపారు. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని చెప్పారు. నీరు చేరడంతో బిరాట్‌నగర్ విమానాశ్రయాన్ని మూసివేశారు.

భారీ వర్షాలతో చైనా అతలాకుతలం

బీజింగ్: భారీ వర్షాలతో చైనా అతలాకుతలం అవుతున్నది. శనివారం వందలాది విమానాలను రద్దు చేసినట్లుగా అధికారులు ప్రకటించారు. భూకంపం వచ్చి వారం రోజులు గడువకముందే అదే ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. షాంఘై, జియాంగ్సు ప్రావిన్సులోని నాన్‌జింగ్, జేజియాంగ్‌లోని హాంగ్‌జూ, యాంగ్‌జూ నది డెల్టా ప్రాంతాలు వరదలవల్ల ప్రభావితం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా మధ్య చైనాకు చెందిన హునన్ ప్రావిన్స్‌లోని యూయాంగ్ కౌంటీ గ్రామంలోని జలాశయం గోడ కూలిపోవడంతో భారీ వరద గ్రామాలను ముంచెత్తుతున్నది. దీంతో వందలాది ఇండ్లు వరదల్లో కొట్టుకుపోయాయి.

653

More News

VIRAL NEWS