హామీలకు రాం..రాం..!


Wed,March 20, 2019 04:33 AM

The central government ignored the partition guarantees

-విభజన హామీలు విస్మరించిన కేంద్రం
-తెలంగాణకు ఎనలేని నష్టం

హైదరాబాద్,నమస్తే తెలంగాణ: విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం తీవ్ర అణచివేతకు గురైంది. ఉద్యమ నాయకుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో సుదీర్ఘ కాలం ఎన్నో పోరాటాలు చేశారు. ఫలితంగా కేంద్రం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ర్టానికి అండగా ఉంటామని చెప్పింది. ఈ మేరకు విభజన చట్టంలో హామీలు ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొనకుండా మరికొన్ని హామీలూ ఉన్నాయి. ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కాగితాలకే పరిమితం చేసింది. ముఖ్యంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వేకోచ్, ఐటీఐఆర్, ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐఐఎం, రాపిడ్ రైల్ రోడ్ కనెక్టివిటి, శాసనసభ సీట్ల పెంపు వంటి హామీలలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా తెలంగాణ సమాజానికి ఎనలేని నష్టం వాటిల్లింది.

ఐదేండ్లు అయినా.. అతీగతి లేదు..

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అపాయింటెడ్ డే తరువాత ఆరునెలల్లో ఖాజీపేట రైల్వేకోచ్, బ య్యారం ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించాలి. సాధ్యమైనంత త్వరగా వీటి నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలి. దీంతో అనేక మంది తెలంగాణ యువకులకు ఉద్యోగాలు దొరికేవి. తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరేంది. కానీ రాష్ట్రం ఏర్పడి ఐదేండ్ల్లు పూర్తి కావస్తున్నది. అయినా ఈ రెండు ప్రాజెక్టుల ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదు. కేసీఆర్ ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రెండు ఫ్యాక్టరీల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం కనికరించలేదు.

-తెలంగాణ రాష్ట్రంలో ర్యాపిడ్ రైల్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టును తీసుకువస్తామని విభజన చట్టంలోనే చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ఇతర ముఖ్య పట్టణాలకు రాపిడ్ రైల్ ఏర్పాటుతో పాటు రోడ్డు కనెక్టివిటీ పెంచుతామని చెప్పారు. రాష్ట్ర విభజన పూర్తయ్యాక దీనిని కేంద్రం పూర్తిగా విస్మరించింది.

-విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2014-15 బడ్జెట్‌లో రూ. కోటి కేటాయించింది. కానీ ఒక్క రూపాయీ విడుదల చేయలేదు. మొన్నటి ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ. 4 కోట్లు కేటాయిస్తున్నట్లు పత్రాలలో పొందుపరిచి చేతులు దులుపుకున్నది. ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదు.

-రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పన్నుల మినహాయింపుతోపాటు, వెనుకబడిన ప్రాం తాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పి నామమాత్రంగా నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నది. అలాగే రాష్ట్రంలో అదనపు పోలీస్ బలగాల పెంపునకు సహకరిస్తామన్నారు. గ్రేహౌండ్స్ బలగాల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహకారం చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

-రాష్ర్టానికి ఐఐఎంను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదు. 60 ఏండ్లుగా తీవ్ర అణచివేతకు గురైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీలుగా ప్రత్యేక హోదా కల్పించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. విభజన చట్టంలో ని సెక్షన్ 47,49 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని ఆదా యం, ప్రయోజనాలు, అప్పులపై తెలంగాణకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. ఏపీ సృష్టిస్తు న్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ట్రెజరరీ, అప్పు వసూళ్లు, అడ్వాన్స్ సెక్యూరిటీలను రెండు రాష్ర్టాలకు జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలి, కానీ ఇప్పటివరకు ఆ చర్యలు చేపట్టలేదు.

-వాణిజ్య, పారిశ్రామిక అండర్‌టేకింగ్‌లతో వచ్చే ఆదాయం, చెల్లింపులను ఇంతవరకు విభజించ లేదు. 9వ షెడ్యూల్‌లోని కంపెనీలు, కార్పొరేషన్ల ద్వారా వచ్చిన ఆదాయ, చెల్లింపులను ఇంతవరకూ విభజించలేదు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, నీటి పంపిణీపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి విభజన చట్టం నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో సమస్యలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే కనీసం పట్టించుకోలేదు.

ఏడు మండలాలు ఏపీకి అప్పగింత

రాష్ట్రాన్ని విభజిస్తూనే కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. విభజన జరిగిన తరువాత మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాను ఏపీలో విలీనం చేసింది. తాము తెలంగాణలోనే ఉంటామని ఆ మండలాల ప్రజలు ఆందోళన చేసినా కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది.

అటకెక్కిన ఐటీఐఆర్

రాష్ట్ర విభజనకు ముందుగానే హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణను అభివృద్ధ్ది చేయాడానికి ఏమాత్రం ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌ను పక్కన బెట్టింది.

శాసనసభ సీట్ల సంఖ్యను పెంచని కేంద్రం

తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్ల సంఖ్యను 153కు పెంచుతామని రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఈ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం వల్ల తమకు వచ్చే రాజకీయ ప్రయోజనం లేదన్న ఒకే ఒక్క సాకుతో సీట్ల సంఖ్య పెంచలేదని తెలంగాణ రాజకీయ మేధావులు భావిస్తున్నారు.

1398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles