మోదీ సభలో కూలిన టెంట్ 90 మందికి గాయాలు


Tue,July 17, 2018 05:15 AM

Tent collapses during PM Modis Midnapore rally 90 injured

-మిడ్నాపూర్ బహిరంగసభలో ప్రధాని ప్రసంగిస్తుండగా ఘటన
మిడ్నాపూర్ (పశ్చిమబెంగాల్), జూలై 16: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న బహిరంగసభలో ఓ టెంట్ కూలిపడడంతో 90 మంది గాయపడ్డారు. వీరిలో పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. వర్షంలో తలదాచుకునేందుకు.. ప్రధాన ద్వారానికి పక్కనే వేసిన ఆ టెంట్ కిందికి కార్యకర్తలు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో రావడం వల్లే టెంట్ కూలినట్లు తెలుస్తున్నది. గాయపడిన వారిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగాన్ని కొద్దిసేపు నిలిపివేసిన ఆయన.. టెంట్ కింద చిక్కుకుపోయిన ప్రజల్ని కాపాడాలని తన భద్రతాసిబ్బందిని ఆదేశించారు. దీంతో ప్రధాని వ్యక్తిగత వైద్యుడితో సహా ఎస్పీజీ సిబ్బంది, బీజేపీ స్థానిక నేతలు అక్కడికి పరిగెత్తుకువెళ్లారు. టెంట్‌ను పక్కకు తప్పించి గాయపడినవారిని ప్రధాని కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లలో దవాఖానకు తరలించారు. తర్వాత ప్రసంగాన్ని కొనసాగించిన మోదీ.. క్షతగాత్రులకు సహాయపడటంలో క్రమశిక్షణతో వ్యవహరించారని కార్యకర్తల్ని అభినందించారు. మరోవైపు గాయపడినవారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైద్యసహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ట్విట్టర్లో తెలిపారు. బహిరంగ సభ అనంతరం దవాఖానకు వెళ్లిన ప్రధాని మోదీ.. ప్రమాద బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

కొద్దిరోజుల్లోనే తృణమూల్ పాలన నుంచి స్వేచ్ఛ

ప్రజాస్వామ్యాన్ని పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ ప్రభుత్వం ఖూనీ చేస్తున్నదని ప్రధాని మోదీ విమర్శించారు. మిడ్నాపూర్‌లో సోమవారం జరిగిన కిసాన్ కల్యాణ్ బహిరంగసభలో ఆయన తృణమూల్‌కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సిండికేట్ రాజ్యాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. కొంతమంది వ్యక్తులే మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతుంటారు. బెంగాల్‌లో ఏం జరుగుతుందో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ప్రపంచమంతా చూసింది. త్వరలోనే తృణమూల్ అరాచక పాలన నుంచి బెంగాల్ ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది అని ఆయన చెప్పారు. గాడితప్పిన వామపక్ష పాలననుంచి బయటపడేందుకు ప్రజలు ఎన్నో ఏండ్లు పోరాడారు. కొద్దిరోజులు ఓపికపట్టండి ఈ అరాచక పాలన కూడా అంతమవుతుంది అని ఆయన అన్నారు. కాగా, ప్రధాని విమర్శలపై తృణమూల్ ఘాటుగా స్పందించింది. దేశంలో మత ఉగ్రవాదాన్ని, హంతక ముఠాలను నడుపుతున్న పార్టీ మమ్మల్ని విమర్శించడం ద్వారా నిప్పుతో చెలగాటం ఆడుతున్నది అని టీఎంసీ నేతలు పార్థచటర్జీ, డెరెక్ ఓబ్రియెన్ విమర్శించారు.

456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles