పాకిస్థాన్ గురించి కాదు భారత్ గురించి మాట్లాడండి


Tue,April 16, 2019 11:02 AM

Talk about India not Pakistan Priyanka Gandhi slams BJP

-గత ఐదేండ్లలో రైతులకు, యువతకు చేసిందేమిటో చెప్పండి
-ప్రచారం కోసం పాకులాడుతూ వాస్తవాలను దాస్తున్నారు
-బీజేపీపై ధ్వజమెత్తినప్రియాంకా గాంధీ
-ఆరోగ్యం ఉచితం అంటూమాటజారిన కాంగ్రెస్ నేత
ఆగ్రా, ఏప్రిల్ 15: ప్రజాస్వామ్యం పట్ల గానీ ప్రజల పట్ల గానీ బీజేపీకి విశ్వాసం ఉన్నట్టు కనిపించడంలేదని, వాస్తవిక మార్గం నుంచి ఆ పార్టీ పక్కకు జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆరోపించారు. దేశం కోసం, యువత సంక్షేమం కోసం బీజేపీ ఏమి చేసిందో చెప్పకుండా పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నదని విమర్శించారు. వాస్తవిక పరిస్థితులపైనే దేశం ఆధారపడిందని, ఆ మార్గం నుంచి వైదొలిగినవారిని ఎవరూ క్షమించరని బీజేపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు. ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగ్రాలో జరిగిన సభలో ప్రియాంక మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో జాతీయవాదం గురించి, పాకిస్థాన్ గురించి బీజేపీ మాట్లాడుతున్నది. ఆ విషయాలను పక్కనపెట్టి దేశం గురించి మాట్లాడాలి. యువత కోసం, రైతుల కోసం, సమాజంలోని ఇతర వర్గాల శ్రేయస్సు కోసం గత ఐదేండ్లలో వారు చేసిందేమిటో చెప్పాలి.

మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించి బీజేపీ అనుసరించే ఎజెండా ఏమిటో వివరించాలి అని డిమాండ్ చేశారు. ప్రచారం కోసం బీజేపీ పాకులాడుతున్నదని, దీంతో వాస్తవాలు మరుగున పడుతున్నాయని, దీని గురించి ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కండ్లలో, వ్యవసాయ రుణాల గురించి, తాము భరిస్తున్న అధిక ఖర్చుల గురించి వివరించేందుకు రాయ్‌బరేలీకి, లోక్నకు వచ్చిన బంగాళాదుంప రైతుల కండ్లలో నాకు వాస్తవం కనిపించింది అని ఆమె పేర్కొన్నారు. తన వ్యవసాయ ఉత్పత్తులను కేవలం రూ.490కి అమ్ముకుని ఆ సొమ్మును ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి పంపి నిరసన వ్యక్తం చేసిన ఓ రైతు ఉదంతాన్ని ప్రియాంక ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానికి తెలియజేసేందుకే ఆ రైతు ఈ పని చేశారని తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో గురించి మాట్లాడుతూ ప్రియాంక మాట జారారు. ఈ మ్యానిఫెస్టోలో ఉన్న పథకాల ద్వారా మీరు ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అని పొరపడ్డారు. అయితే అంతలోనే తేరుకుని తన తప్పును సరిదిద్దుకున్నారు. వైద్యపరీక్షలు, చికిత్స ఉచితమని, ఆరోగ్యం కూడా ఉచితంగా లభిస్తే ఇంకా మంచిది అని పేర్కొన్నారు.

673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles