తాజ్‌పై ఇంత ఉదాసీనతా?


Thu,July 12, 2018 02:54 AM

Taj Mahal must be protected or demolished

-కాపాడతారా? కూల్చేస్తారా?!
-ఈఫిల్ టవర్ కంటే తాజ్‌మహల్ అందమైనది
-దానిని పరిరక్షించే ఉద్దేశం అసలు మీకు ఉందా?
-మీ నిర్లక్ష్యం వల్ల పర్యాటక ఆదాయం తగ్గుతున్నది
-కేంద్రం, ఏఎస్‌ఐ, యూపీ సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ, జూలై 11: ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ సంరక్షణలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్రప్రభుత్వం, భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ), యూపీ సర్కారుపై సర్వోన్నత న్యాయస్థానం భగ్గుమన్నది. ఈ చారిత్రక కట్టడం పరిరక్షణ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి కాపాడుతారా? లేదంటే కూల్చేస్తారా? తేల్చిచెప్పాలంటూ సుప్రీంకోర్టు వారికి మొట్టికాయలు వేసింది. తాజ్‌మహల్ పరిరక్షణపై దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ మదన్ బీ.లోకూర్, జస్టిస్ దీపక్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తాజ్ పరిరక్షణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. చారిత్రక కట్టడమైన తాజ్‌ను పరిరక్షించే ఉద్దేశం మీకు ఉన్నట్లు కనిపించడంలేదు. ఈ కట్టడాన్ని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీరు ఈ కట్టడాన్ని పునరుద్ధరిస్తారా? లేదంటే కూల్చివేస్తారా? తేల్చిచెప్పండి. లేదంటే తాజ్‌ను మూసివేయండి అని కేంద్రం, ఏఎస్‌ఐ, యూపీ సర్కారుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.

పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా తాజ్‌మహల్ అందమైనదని, వారి కంటే ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చని పేర్కొంది. ఈఫిల్ టవర్‌ను ఏటా 8 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. కానీ మన తాజ్ దానికంటే చాలా అందమైనది. గత ఏడాది తాజ్‌ను కోటి మంది సందర్శించారు. కానీ, మనకంటే 8 రెట్ల మంది పర్యాటకులు ఈఫిల్‌టవర్‌ను చూసేందుకు వెళుతున్నారు. మనం ఇంతటితోనే సంతృప్తి చెందుదామా? మీ ఉదాసీనత, నిర్లక్ష్యం వల్ల పర్యాటకుల ద్వారా వచ్చే విదేశీమారక ద్రవ్యం దేశానికి రాకుండా పోతున్నది. విదేశాల్లో పర్యాటకం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కానీ, ఇక్కడ మీ నిర్లక్ష్యంతో టూరిజానికి నష్టం వాటిల్లుతున్నది.

తాజ్ పరిరక్షణ కుదరకపోతే మీరు ఒక పనిచేయండి.. తాజ్‌ను కూల్చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. విదేశాల్లో నగరాలను వీక్షించేందుకు టీవీ టవర్ లాంటి భారీ టవర్‌లను ఏర్పాటుచేస్తారని, భారత్‌లో మాత్రం అలాంటి సదుపాయం ఎక్కడా లేదని ధర్మాసనం పేర్కొన్నది. ఇందుకు భద్రతాపరమైన కారణాలను చూపుతున్నారని తెలిపింది. తాజ్‌ను కాపాడి, పరిరక్షించడంపై స్పష్టమైన విధానాన్ని రూపొందించడంలో యూపీ సర్కారు విఫలమైందంటూ మండిపడింది. ఈ అపురూప కట్టడాన్ని పరిరక్షించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి తీసుకున్నారు? భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? అనే అంశాలపై సవివరమైన అఫిడవిట్‌ను రెండు వారాల్లోగా తమకు సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తాజ్ పరిరక్షణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం కనీస చర్యలు కూడా తీసుకోలేదని ఆక్షేపించింది.

మరోవైపు ఐఐటీ- కాన్పూర్ నేతృత్వంలోని బృందం తాజ్ చుట్టూ వాయుకాలుష్య స్థాయిని అంచనా వేస్తున్నదని, నాలుగు నెలల్లో తన నివేదికను అందజేస్తుందని కేంద్రం తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎన్‌ఎస్ నాద్‌కర్ణి సుప్రీంకోర్టుకు విన్నవించారు. కట్టడం లోపల, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి గల కారణాల్ని గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని కూడా నియమించినట్లు పేర్కొన్నారు. అయితే, ఆగ్రాలో 22 వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాల్సి ఉండగా కేవలం నాలుగింటిని మాత్రమే నెలకొల్పడంలో ఆంతర్యమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అధికారయంత్రాంగం అలసత్వం కారణంగా తాజ్ ప్రతిష్ఠ మసకబారుతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది. తాజ్ పరిరక్షణ కోసం ముందుచూపుతో దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది. ఈ నెల 31నుంచి తాజ్ అంశంపై రోజువారీ విచారణను చేపడతామని ధర్మాసనం స్పష్టంచేసింది. మరోవైపు తాజ్ పరిధిలో పారిశ్రామిక వాడలను నిషేధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన తాజ్ ట్రెపీజియం జోన్ చైర్మన్ స్వయంగా తమ ఎదుట హాజరై వివరణివ్వాలని ధర్మాసనం ఆదేశించింది. వాయుకాలుష్యంతో తాజ్‌కు ముప్పు పొంచి ఉందని, ఈ కట్టడం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలంటూ పర్యావరణవేత్త ఎంసీ మెహతా ఈ పిటిషన్‌ను దాఖలుచేశారు.

1225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles