తాజ్‌మహల్ ఓ హిందూ ఆలయం!Thu,October 19, 2017 02:22 AM

-గతంలో అక్కడ శివాలయం ఉండేది
-తాజ్ పేరును తేజోమహల్‌గా మార్చాలి
-బీజేపీ ఎంపీ కటియార్ వాదన

Tajmahal
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరెన్నికగన్న తాజ్‌మహల్ హిందూ కట్టడమన్న వాదనలను బీజేపీ నేతలు ముందుకు తెస్తున్నారు. తెల్లని పాలరాతి కట్టడానికి మతాల రంగు పులిమేందుకు పోటీపడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ మరో వివాదానికి తెరతీశారు. తాజ్‌మహల్‌ను ఓ ప్రాచీన శివాలయం శిథిలాల మీద నిర్మించారని, కాబట్టి తాజ్‌మహల్ పేరును తేజోమహల్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. తాజ్‌మహల్ ఓ హిందూ ఆలయం. హిందూ దేవుళ్లు, దేవతల చిహ్నాలు అనేకం మనకు అక్కడ కనిపిస్తాయి. దానిని తేజోమహల్ అని పిలిచేవారు. అక్కడ శివలింగంపై జలధార పడుతుండేది అని కటియార్ మీడియాతో అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజ్‌మహల్‌లోనికి వెళ్లి చూస్తే హిందూ చిహ్నాలు కనిపిస్తాయని సూచించారు. అది కేవలం సమాధి అయితే లోపల అన్ని గదులు ఎందుకున్నాయి? ఇప్పుడు ఆ నిర్మాణాలను కూల్చాల్సిన పనిలేదు. పేరును తేజోమహల్‌గా మారిస్తే సరిపోతుంది. బ్రిటిష్‌వారు నిర్మాణాలను కూల్చలేదు. మొఘల్ పాలకులు ఆ పని చేశారు అని కటియార్ అన్నారు.

పర్యాటకంలో తాజ్ కీలకం

తాజాగా కేంద్ర పర్యాటక శాఖమంత్రి అల్ఫోన్స్ కన్నంథనం తాజ్‌పై భిన్నవ్యాఖ్యలు చేశారు. తాజ్ భారత్‌కు గర్వకారణమని, మనదేశ పర్యాటకంలో అది కేంద్రస్థానంలో ఉన్నదని అన్నారు. ఆ చారిత్రక కట్టడానికి సంబంధించి ప్రభుత్వం పెద్దపెద్ద ప్రణాళికలు వేస్తున్నదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

యూపీ ప్రభుత్వ క్యాలెండర్‌లో చోటు

తాజ్‌మహల్ లేకుండా పర్యాటక పుస్తకం ముద్రించిన యూపీ సర్కారు రాబోయే 2018 సంవత్సరపు క్యాలెండర్‌లో మాత్రం ఆ చారిత్రక కట్టడానికి ఓ పేజీ కేటాయించింది.
Vinay-Katiyar

బాబ్రీ తరహాలోనే తాజ్‌నూ కూలుస్తారేమో: ఆజంఖాన్

ప్రపంచం చూపు తాజ్‌మహల్‌పై ఉన్నది కనుకనే ఇంకా అది ఉనికిలో ఉన్నదని, లేకుంటే బాబ్రీమసీదు తరహాలో ఎప్పుడో దానిని కూల్చేసేవారని సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ అన్నారు. బీజేపీ నేతలు తాజ్‌కు వ్యతిరేకంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాబ్రీమసీదును కూల్చేందుకు ముందే దానికి వ్యతిరేకంగా దుమారం రేపారని, ఇప్పుడు తాజ్ విషయంలో కూడా అదే జరుగుతున్నదని అన్నారు.

2273

More News

VIRAL NEWS