ఎన్నికల సంస్కర్త శేషన్‌ కన్నుమూత

Mon,November 11, 2019 03:09 AM

- గుండెపోటుతో చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస
- 1990-96 మధ్య సీఈసీగా విధులు
- ఎన్నికల సంఘం రూపురేఖలు మార్చిన శేషన్‌
- ఎన్నికల్లో అక్రమాలపై ఉక్కుపాదం
- ప్రవర్తనా నియమావళికి రూపకల్పన

చెన్నై, నవంబర్‌ 10: దేశంలో ఎన్నికల సంస్కరణలకు బాటలుపరిచిన కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) తిరునళ్లై నారాయణ అయ్యర్‌ శేషన్‌ (టీఎన్‌ శేషన్‌) కన్నుమూశారు. గత కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని తన నివాసంలో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 87 ఏండ్లు. ‘మాజీ సీఈసీ టీఎన్‌ శేషన్‌ మరణవార్త తెలియజేసేందుకు ఎంతో చింతిస్తున్నాను. ఆయన నిజమైన లెజెండ్‌. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేరళలోని పాలక్కడ్‌ జిల్లా తిరునళ్లైలో1932 డిసెంబర్‌ 15న శేషన్‌ జన్మించారు. 1990-96 మధ్య దేశ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు. దేశంలో ఎన్నికల అక్రమాలను గణనీయంగా తగ్గించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
TN-Seshan2
1955 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శేషన్‌.. 1988లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రక్షణ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాదే క్యాబినెట్‌ సెక్రటరీగా పదోన్నతి పొందారు. అయితే ఆ తర్వాత వీపీ సింగ్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శేషన్‌ను ప్రణాళికా సంఘానికి బదిలీ చేశారు. 1990 డిసెంబర్‌లో పదో సీఈసీగా టీఎన్‌ శేషన్‌ను రాష్ట్రపతి వెంకటరామన్‌ నియమించారు. ఆ తర్వాతి ఆరేండ్లలో ఎన్నికల సంఘం ముఖచిత్రాన్ని శేషన్‌ సమూలంగా మార్చివేశారు. ధనబలం, కండబలం ఉన్నవారే ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించే రోజుల్లో, అన్ని అడ్డంకులను అధిగమించి ఎన్నికల ప్రవర్తన నియమావళికి రూపకల్పన చేశారు. అన్ని రాష్ర్టాల్లోనూ ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమించారు. ఎన్నికల ప్రక్రియను వీరు పర్యవేక్షించేవారు. విద్వేషపూరిత ప్రసంగాలు, ఓటర్లకు బెదిరింపులు, ఓట్ల దొంగలింపు, ఎన్నికల హింసను అడ్డుకునేందుకు వీరు చర్యలు చేపడుతారు. ఎన్నికల వ్యయంపైనా శేషన్‌ ఉక్కుపాదం మోపారు. ఎన్నికల ప్రలోభాలను, బెదిరింపులను అడ్డుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టారు.
TN-Seshan3
TN-Seshan1

కేంద్ర మంత్రులను తొలిగించాలని ఆదేశాలు..

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ 1994లో నాటి కేంద్ర మంత్రులు సీతారాం కేసరి, కల్పనాథ్‌ రాయ్‌లను మంత్రివర్గం నుంచి తొలిగించాలని నాటి ప్రధానిని ఎన్నికల కమిషనర్‌గా శేషన్‌ కోరడం అప్పట్లో సంచలనం రేపింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని శేషన్‌ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైనప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల్లో పారదర్శకత, సమగ్రత తీసుకొచ్చేందుకు విశేష కృషి చేసిన శేషన్‌ను 1996లో ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసే అవార్డు వరించింది. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కోసం గట్టిగా నిలబడిన ఆయన.. చాలా మంది రాజకీయ నేతలతో తలపడ్డారు. దీంతో ఆయనను సీఈసీగా తొలిగించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. 1997లో ఆయన పదవీ విరమణ చేశారు. అనంతరం రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ, కేఆర్‌ నారాయణన్‌ చేతిలో ఓడిపోయారు.
sheshan

ప్రముఖుల సంతాపం

టీఎన్‌ శేషన్‌ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘టీఎన్‌ శేషన్‌ మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దేశ ప్రజాస్వామ్యానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందిస్తూ.. ‘టీఎన్‌ శేషన్‌ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన నిజమైన లెజెండ్‌. ఎన్నికల సంస్కరణలకు ఆయన చేసిన కృషి భవిష్యత్‌కు మార్గదర్శకం. నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని పేర్కొన్నారు.

903
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles