కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత సబబే

Thu,November 14, 2019 04:26 AM

-ఐదేండ్లవరకూ ఎన్నికల్లో పోటీచేయొద్దనడం మాత్రం సరైందికాదు
-17 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం మీద సుప్రీంకోర్టు తీర్పు
-స్పీకర్లు తటస్థంగా ఉండాలని హితవు
-బీజేపీలో చేరనున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్స్‌!
-డిసెంబర్‌ 5న జరిగే ఉపఎన్నికల్లో పోటీ

న్యూఢిల్లీ, నవంబర్‌ 13: కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. వారు ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసే (2023) వరకూ ఎన్నికల్లో పోటీచేయరాదంటూ స్పీకర్‌ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో డిసెంబర్‌ 5న 15 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల్లో వారు పోటీచేసేందుకు మార్గం సుగమమైంది. న్యాయమూర్తులు ఎన్వీ రమణ, సంజీవ్‌ ఖన్నా, కృష్ణ మురారీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ కింద లభించిన అధికారాలను బట్టి స్పీకర్‌కు ఓ సభ్యుడిని నిర్దిష్టకాలం వరకు అనర్హులను చేసే అధికారంగానీ లేదా ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించే అధికారంగానీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీచేసి మళ్లీ గెలిస్తే, వారు రాష్ట్ర మంత్రివర్గంలో చేరవచ్చని కూడా తెలిపింది. వాస్తవాలు, కేసుకు దారితీసిన పరిస్థితుల ఆధారంగా తీర్పును ప్రకటిస్తున్నామని, సభ్యులను అనర్హులను చేయగల స్పీకర్‌ అధికారాలలో తాము జోక్యం చేసుకోవడం లేదని ధర్మాసనం వివరించింది. స్పీకర్లు తటస్థంగా ఉండాలన్నది రాజ్యాంగ విధి అని, కానీ వారు అందుకు విరుద్ధంగా వ్యవహరించే ధోరణి పెరిగిపోతున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే రాజకీయ పార్టీలు సైతం బేరసారాలు జరుపుతూ, అవినీతికి పాల్పడుతున్నాయని, దీంతో ప్రజలకు స్థిరమైన ప్రభుత్వాలు లభించడం లేదని పేర్కొంది. తటస్థ వ్యక్తిగా స్పీకర్‌ సభ నిర్వహణలో లేదా పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విషయంలో స్వతంత్రంగా వ్యవహరించాలని తెలిపింది. రాజ్యాంగం తనపై పెట్టిన బాధ్యతను స్పీకర్‌ నిశితంగా అనుసరించాలని, ఈ క్రమంలో అతని రాజకీయ సంబంధాలు అడ్డంకిగా ఉండరాదని స్పష్టం చేసింది. అప్రజాస్వామిక ప్రక్రియలు చోటుచేసుకోకుండా నిరోధించేందుకు కొన్ని అంశాలను బలోపేతం చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోర్టు సూచించింది. గత జూలైలో నాటి కుమారస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి ముందు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసే వరకూ వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోలేకపోయిన హెచ్‌డీ కుమారస్వామి తన పదవి నుంచి తప్పుకోవడంతో బీఎస్‌ యెడియూరప్ప నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సభ్యులపై అనర్హత వేటుతో కర్ణాటక అసెంబ్లీలో 17 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 15 సీట్లకు డిసెంబర్‌ 5న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మరో రెండు సీట్లకు సంబంధించిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానాలలో ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్నికలు నిర్వహించడం లేదు.

నేడు కాషాయ దళంలోకి అనర్హులు

కుమారస్వామి ప్రభుత్వం పతనానికి కారణమైన 17 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు గురువారం బీజేపీలో చేరనున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అశ్వత్‌నారాయణ చెప్పారు. వారు బీజేపీలో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తూ తమ పార్టీ కేంద్ర నాయకులను కలుసుకున్నారని తెలిపారు. దీంతో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బెంగళూరులో సీఎం బీఎస్‌ యెడియూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ సమక్షంలో వారు కాషాయ కండువాలు కప్పుకుంటారని తెలిపారు.

సుప్రీం తీర్పు బీజేపీకి వరమా? శాపమా?

అనర్హతకు గురైన17 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక సీఎం యెడియూరప్ప సహా పలువురు బీజేపీ నేతలు స్వాగతించారు. మరోవైపు కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన ఆ 17 మందిని బీజేపీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారందరికీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్‌ కూడా ఇవ్వవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి గెలుపోటములు యెడియూరప్ప ప్రభుత్వ భవితవ్యాన్ని తేలుస్తాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 17 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడంతో రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 225 నుంచి 208కి తగ్గిపోయింది. దీంతో 105 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ మరో ఇండిపెండెంట్‌ మద్దతుతో అసెంబ్లీలో బలం నిరూపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా 15 స్థానాలకు ఎన్నికలు జరుగనుండటంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 223కు చేరుతుంది. అప్పుడు అధికార పార్టీకి కనీసం 112 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఉప ఎన్నికలు జరుగనున్న 15 స్థానాల్లో బీజేపీ కనీసం ఏడు స్థానాల్లో కచ్చితంగా గెలుపొందాలి. కానీ పార్టీ మారి వస్తున్న సభ్యులకే బీజేపీ టికెట్లు ఇస్తే ఆ పార్టీ స్థానిక నేతల్లో అసంతృప్తి పెల్లుబుకవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles