అవసరమైతే సిట్ దర్యాప్తు!


Tue,September 18, 2018 02:39 AM

Supreme Court to examine material against activists extends their house arrest till Sept 19

-హక్కుల నేతల గృహనిర్బంధం మరో రెండు రోజులు పొడిగింపు
-ఈనెల 19 తర్వాత పూర్తిస్థాయి విచారణ జరుపుతాం
-పోలీసులే సాక్ష్యాధారాలు సృష్టించి ఉంటే, కేసును కొట్టేస్తాం:సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: భీమా కోరేగావ్ హింస ఘటనతోపాటు నక్సల్స్‌తో సంబంధాలు కలిగి ఉన్నారన్న అభియోగాలపై ఐదుగురు ప్రముఖ హక్కుల కార్యకర్తల అరెస్టు వ్యహారానికి సంబంధించి అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అరెస్టయిన హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని మరో రెండురోజులు పొడిగించింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పౌరహక్కుల కార్యకర్తల అరెస్టుకు సహేతుకమైన ఆధారాలున్నాయా, లేవా అనేది ఈ నెల 19 తర్వాత పరిశీలించి తుదినిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. పోలీసులే సాక్ష్యాలు సృష్టించి ఉంటే, కేసు కొట్టివేస్తామని స్పష్టంచేసింది. భీమాకోరేగావ్ అల్లర్ల కేసులో.. విరసం నేత వరవరరావు, హక్కుల ఉద్యమకారులు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖా, ట్రేడ్‌యూనియన్ ఉద్యమనేత సుధా భరద్వాజ్‌లను ఆగస్టు 28న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ చరిత్ర పరిశోధకురాలు రొమిల్లా థాపర్, ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవికాజైన్ మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ జరిపిన సుప్రీంకోర్టు తొలుత సెప్టెంబర్ 6వరకు వారిని గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. తర్వాత ఈనెల 12వరకు, ఈనెల 17వరకు పొడిగించిన న్యాయస్థానం సోమవారం మరో రెండురోజులు గృహనిర్బంధాన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అరెస్టుల్లో పోలీసులు మోపుతున్న అభియోగాలను బలపరిచే ఆధారాలు వారి వద్ద ఎంతవరకు ఉన్నాయో మేం చూడాల్సి ఉంది అని పేర్కొన్నది. పోలీసులే ఆధారాలను సృష్టించి, తప్పుడు కేసు బనాయించి ఉంటే మాత్రం ఈ కేసును కొట్టివేస్తామని తెలిపింది. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉన్నపక్షంలో.. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, అరెస్టులకు దారితీసిన పరిస్థితులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించే అంశాన్నీ పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది.

కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్స్ మణీందర్‌సింగ్, తుషార్ మెహతా.. పిటిషన్ విచారణకు అర్హమైనది కాదన్నారు. నిందితుల అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్‌దారులు దిగువ కోర్టులకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు? అని వారు ప్రశ్నించారు. ఈ విషయమై జోక్యం చేసుకున్న ధర్మాసనం.. స్వేచ్ఛ, స్వతంత్ర దర్యాప్తు అనే అంశాల ప్రాతిపదికన పిటిషన్‌ను మేం విచారణకు స్వీకరించాం. ఒకవేళ వారు దిగువ కోర్టులకు వెళ్లాలనుకుంటే వెళ్లనివ్వండి. అంతవరకు మా మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయి అని స్పష్టంచేసింది. ప్రధానమంత్రిని అంతమొందించేందుకు కుట్రపన్నారని మీడియాకు తెలిపిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆ కీలకాంశాన్ని ఎందుకు చేర్చలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులు సమగ్ర నివేదికతో రావాలని, ఈనెల 19న పూర్తిస్థాయి వాదోపవాదాలు వింటామని ధర్మాసనం తెలిపింది. అంతవరకు హక్కుల నేతల గృహనిర్బంధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అర్బన్ నక్సల్స్‌తో ముప్పును అంచనా వేయడం కష్టం: రాజ్‌నాథ్

rajnath
అర్బన్ నక్సల్స్‌తో పొంచి ఉన్న ముప్పును అంచనా వేయడం కష్టమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. అయినప్పటికీ ఆ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని అన్నారు. మావోయిస్టు భావజాలాన్ని కలిగి జనబాహుళ్యంలో తిరిగే ప్రభావశీలురైన వ్యక్తుల్ని అర్బన్ నక్సల్స్‌గా ప్రస్తావిస్తున్నారు. గతనెలలో ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తల అరెస్టు తర్వాత ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. సోమవారం జమ్మూలోని బీఎస్‌ఎఫ్ హెడ్‌క్వార్టర్‌ను సందర్శించిన రాజ్‌నాథ్‌సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అర్బన్ నక్సల్స్ నుంచి ఏస్థాయి ముప్పు ఉందన్నదానికి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఏ ప్రమాణాలు, పరామితుల ఆధారంగా ఆ ముప్పును లెక్కగట్టాలి? అయితే వారి నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని చెప్పారు. ఈశాన్య రాష్ర్టాల్లో తీవ్రవాదాన్ని నిర్మూలించగలిగాం. నక్సలిజం కొనఊపిరితో ఉంది. ఇక కశ్మీర్‌లో తీవ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు భద్రతాబలగాలు శ్రమిస్తున్నాయి అని అన్నారు.

819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles