నేడూ కీలక తీర్పులు!

Thu,November 14, 2019 04:26 AM

-శబరిమల, రాఫెల్ వివాదాలపై తీర్పులను వెల్లడించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్ 13: అయోధ్య వివాదంపై గత శనివారం చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ఇదే క్రమంలో గురువారం కూడా సుప్రీంకోర్టు పలు కీలక కేసులకు సంబంధించి తీర్పులను వెలువరించనుంది. ఇందులో శబరిమల వివాదం, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ ఉన్నాయి.


శబరిమలలోకి మహిళలు!

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10-50 ఏండ్ల మహిళలకు ప్రవేశంపై ఉన్న నిషేధం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు మెజార్టీ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అన్ని వయసుల మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అయితే కోర్టు తీర్పుపై హిందూపక్షాలు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశాయి. నిరసనలతో కేరళ అట్టుడికింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆలయాన్ని నిర్వహిస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తొలుత సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించి, ఆ తర్వాత యూటర్న్ తీసుకుంది. రివ్యూ పిటిషన్లను వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వంతో జతకలిసింది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ ఒత్తిడి వల్లే టీడీబీ యూటర్న్ తీసుకుందని హిందూ పక్షాలు ఆరోపించాయి. రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గురువారం తుదితీర్పును వెలువరించనుంది.

rafel

రాఫెల్ రగడ..

రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రాఫెల్ వివాదంపైనా సుప్రీంకోర్టు గురువారం తీర్పును ప్రకటించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి క్లీన్‌చిట్ ఇస్తూ గత డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, కోర్టు పర్యవేక్షణలో దీనిపై విచారణ జరుపాలని దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు నాడు కొట్టివేసింది. అయితే తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్లు దాఖలుచేశారు. ఈ ఒప్పందంలో పలు కీలక విషయాలను కోర్టుకు చెప్పకుండా కేంద్రం దాచిపెట్టిందనివారు ఆరోపించారు.

Rahul Gandhi
ఇందులో భారత్‌తరఫున చర్చల బృం దంలో పాల్గొన్న ముగ్గురుసభ్యుల అసమ్మతి పత్రం కూడా ఉన్నదని పేర్కొన్నారు. అయితే ఈ పత్రాలు రహస్యమని, అనధికారికంగా వీటిని సేకరించారని, వీటిని పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్రం వాదించింది. అయితే కోర్టు కేంద్రంవాదనను తోసిపుచ్చింది. పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. గత మేలో తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. గురువారం తుదితీర్పును వెలువరించనుంది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌పైన కోర్టు గురువారం తీర్పు వెల్లడించనుంది. ప్రధాని మోదీని చౌకీదార్ చోర్ హై అంటూ తాను చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందంటూ రాహుల్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. కోర్టు తీర్పును తప్పుగా అన్వయించి రాహుల్ ప్రధానిపై విమర్శలు చేశారని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ.. రాహుల్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుచేశారు.

733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles