జర్నలిస్టుకు విముక్తి


Wed,June 12, 2019 02:18 AM

Supreme Court tells UP govt to release journalist Prashant Kanojia asks ever heard of such arrests

-యూపీ సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులోప్రశాంత్ కనోజాకు సుప్రీంకోర్టు బెయిల్
-సోషల్‌మీడియా పోస్ట్‌కు 11 రోజుల కస్టడీ సరికాదన్న ధర్మాసనం
-ఇది స్వేచ్ఛ హక్కును హరించడమేనని వ్యాఖ్య
-ప్రశాంత్‌పై విచారణ కొనసాగుతుందని వెల్లడి

న్యూఢిల్లీ, జూన్ 11: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టయిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే బెయిల్ ఇచ్చినంత మాత్రాన ప్రశాంత్ చేసిన పనిని సమర్ధించినట్టు కాదని, కేసు దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టంచేసింది. వ్యక్తి స్వేచ్ఛ హక్కును కాపాడేందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామని వెల్లడించింది. యూపీ సీఎం యోగిపై సోషల్‌మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూపీ పోలీసులు ప్రశాంత్ కనోజాతోపాటు ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ మహిళ యూపీ సీఎం ఆఫీస్ ముందు నిలబడి మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పెండ్లి ప్రతిపాదన పంపానని చెప్పింది. ఈ వీడియోను జర్నలిస్ట్ ప్రశాంత్ తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 11 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన భార్య జగిశా అరోరా సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సోషల్ మీడియా పోస్ట్‌ల కారణంగా ఒక వ్యక్తి 11 రోజులపాటు జైలులో ఉండటం సరికాదని అభిప్రాయపడింది. వ్యక్తి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక

హక్కు. అది ఎంతో పవిత్రమైనది. ఈ విషయంలో మరోమాటకు తావులేదు అని ధర్మాసనం పేర్కొన్నది. అందుకే ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. బెయిల్ ఇచ్చినంత మాత్రాన ప్రశాంత్ వ్యాఖ్యలను తాము సమర్థించినట్టు కాదని చెప్పింది. ఆయనపై వచ్చిన అభియోగాలపై చట్ట ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టంచేసింది.

అక్రమంగా నిర్బంధించారు

సుప్రీంకోర్టు తీర్పుపై జర్నలిస్ట్ ప్రశాంత్ భార్య జగిశా అరోరా మీడియాతో మాట్లాడారు. తన భర్తను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని, కనీసం యూనిఫాం కూడా ధరించలేదని పేర్కొన్నారు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు సైతం తేల్చిందని గుర్తుచేశారు. తన భర్త చేసిన ట్వీట్‌లో పెద్ద తప్పేమీ లేదన్నారు. అదో కామెడీ వీడియో మాదిరిగా ఉండటం వల్లే షేర్ చేశారని, ఇందులో వేరే ఉద్దేశం లేదని పేర్కొన్నారు.

యోగి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు: రాహుల్ గాంధీ

జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. ఆరెస్సెస్ లేదా బీజేపీ వర్గీయులు చెప్పే మాటలు వింటూ.. తప్పుడు వార్తలు రాశారని, నకిలీ కథనాలు పోస్ట్ చేశారంటూ జర్నలిస్టులను అరెస్ట్ చేసుకుంటూ పోతే కొన్నాళ్లకు పత్రికలు, న్యూస్ చానళ్లు భారీగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటాయి అని విమర్శించారు. ఈ అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. యూపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోవడం మానేసి జర్నలిస్టులు, రైతులు, ఇతర వర్గాల ప్రతినిధులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles