కేంద్రానికి ఎదురుదెబ్బ

Thu,November 14, 2019 04:11 AM

-ట్రిబ్యునళ్ల నియామకాలకు.. ఫైనాన్స్ చట్టం నిబంధనలు చెల్లవ్
-సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జ్యుడీషియల్ ట్రిబ్యునళ్ల నియామకాలను ఇదివరకే ఉన్న శాసనాలను అనుసరించే చేపట్టాలని, ఫైనాన్స్ యాక్ట్-2017 కింద రూపొందించిన నిబంధనల ద్వారా కాదని సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్ యాక్ట్‌ను ఆర్థిక బిల్లుగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నిబంధనలను తిరిగి రూపొందించాలని, అప్పటివరకు ప్రస్తుత చట్టాలను అనుసరించే ట్రిబ్యునళ్లు పనిచేస్తాయని ధర్మాసనం స్పష్టంచేసింది.

అలాగే ప్రభావ అధ్యయనం (ఇంపాక్ట్ స్టడీ) చేపట్టి తమకు నివేదిక అందజేయాలని కేంద్ర న్యాయ శాఖను ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ వంటి జ్యుడీషియల్ ట్రిబ్యునల్ సభ్యుల నియామకాలు, బదిలీలు, సర్వీస్ నిబంధనలు నిర్ణయించడానికి ఫైనాన్స్ చట్టం ద్వారా కేంద్రానికి అధికారాలు లభిస్తాయి. ఫైనాన్స్ చట్టం చెల్లుబాటుపై విస్తృత ధర్మాసనం తుది నిర్ణయం వెల్లడిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. పన్నులు, ప్రభుత్వ వ్యయాలకు సంబంధించిన బిల్లులను ఆర్థిక బిల్లులుగా పరిగణిస్తారు. ఆర్థిక బిల్లులను కేవలం లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెడతారు. రాజ్యసభ కేవలం సవరణలను మాత్రమే సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక బిల్లుగా ఫైనాన్స్ చట్టాన్ని ఆమోదించడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.

342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles