ఆధార్‌ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతపై పరిశీలన

Sat,November 23, 2019 02:58 AM

- సుప్రీంకోర్టు నిర్ణయం
న్యూఢిల్లీ, నవంబర్‌ 22: మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్‌కు, బ్యాంకు ఖాతా లు తెరిచేందుకు గుర్తింపు ధ్రువీకరణగా వినియోగదారుల ఆధార్‌ డేటా వినియోగించుకునేందుకు ప్రైవేట్‌ సంస్థలకు అనుమతినిస్తున్న ‘ఆధార్‌ (సవరణ) చట్టం, నిబంధనల’ రాజ్యాంగ బద్ధతను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఆధార్‌ సవరణ చట్టం, నిబంధనలు పౌరుల వ్యక్తిగత గోప్యతతోపాటు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు (యూఐడీఏఐ) శుక్రవారం నోటీసులు జారీచేసింది. ఆధార్‌ చట్టం ‘రాజ్యాంగబద్ధమే’ అంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే బ్యాంకు, మొబైల్‌ ఖాతాలు తెరిచేందుకు, స్కూల్లో ప్రవేశాలకు ఆధార్‌ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంచేసింది. తదనంతరం వివిధ సేవలకు ఆధార్‌ను స్వచ్ఛందంగా ఇవ్వొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ చట్టానికి సవరణలు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆర్మీ మాజీ అధికారి ఎస్‌జీ వోంబత్కెరే, సామాజిక కార్యకర్త బెజవాడ విల్సన్‌ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలుచేశారు.

178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles