సారిడాన్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్


Tue,September 18, 2018 02:47 AM

Supreme Court Lifts Ban on Sale of Painkiller Saridon 2 Other Drugs

-మరో మూడు మందులవిక్రయాలపైనా నిషేధం ఎత్తివేత
-కేంద్రం స్పందన తర్వాతే నిర్ణయం: ధర్మాసనం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: తలనొప్పి నివారణ మాత్ర సారిడాన్‌తోపాటు మరో మూడు ఔషధాల విక్రయాలపై కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం తొలిగించింది. ప్రస్తుతానికి సారిడాన్, పిరిటన్ ఎక్స్‌పెక్టోరాంట్, డార్ట్‌తోపాటు మరో మందును విక్రయించవచ్చునని తెలిపింది. ఔషధ తయారీ సంస్థల పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ విషయంలో కేంద్రం స్పందనను కోరింది. ప్రభుత్వ స్పందన తర్వాతే పూరిస్థాయి నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టంచేసింది. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటూ సెప్టెంబర్ 7న కేంద్ర ఆరోగ్యశాఖ 328 మందులను అసురక్షిత ఔషధాలుగా పేర్కొంటూ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇందులో తలనొప్పి నివారణ మాత్ర సారిడాన్ కూడా ఉంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ మిశ్రమాలతో తయారైన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) మందుల్లో వైద్యపరమైన ప్రమాణాలేవీ పాటించడంలేదని ఔషధ సాంకేతిక సలహా మండలి (డ్రగ్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు-డీటీఏబీ) వెల్లడించడంతో ఆయా మందుల విక్రయాలపై కేంద్రం నిషేధం విధించింది. ఇలాంటి మందుల్లో వాడుతున్న మిశ్రమాలు రోగికి ఏలాంటి మేలు చేయడంలేదని, విచ్చలవిడి వాడకం నుంచి ప్రజలను కాపాడేందుకే నిషేధం నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

తమ మందుల విక్రయాలపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ కొన్ని ఫార్మా కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై జస్టిస్‌లు ఆర్‌ఎఫ్ నారిమన్, ఇందూమల్హోత్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. డీటీఏబీ నివేదికను మాకు అందజేయకుండా, మా వాదనను వినకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా నిషేధ నిర్ణయం తీసుకున్నది అని ఫార్మా కంపెనీలు వాదించాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం.. ప్రస్తుతానికి సారిడాన్, మరో మూడు మందుల విక్రయాలు కొనసాగించవచ్చునని ధర్మాసనం అనుమతినిచ్చింది. 1988కి ముందు నుంచీ తయారవుతున్న ఎఫ్‌డీసీలను అనుమతించాలన్న వాదనపై తన వైఖరిని తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం స్పందన తర్వాత మిగతా మందులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
Saridon1

1631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles