హక్కుల నేతల గృహనిర్బంధం పొడిగింపు


Thu,September 13, 2018 12:36 AM

Supreme Court extends house arrest of rights activists in Koregaon Bhima violence till September 17

-ఈ నెల 17 వరకు గడువు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: బీమా-కోరేగావ్ హింస కేసుతో సంబంధం ఉన్నదంటూ వివిధ నగరాల్లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన హక్కుల నేతలకు మరో ఐదురోజుపాటు గృహనిర్బంధాన్ని పొడిగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్లు చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురి తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వేరే కేసు విషయంలో మరో కోర్టులో వాదనలు చేయాల్సి ఉన్నందున ఈ కేసును వాయిదా వేయాలని కోరారు. న్యాయవాది విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం హక్కుల నేతల గృహనిర్బంధాన్ని ఐదురోజులు పొడిగిస్తూ కేసును వాయిదా వేసింది.

హక్కుల నేతలు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొంజాల్వేజ్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖా అరెస్టులకు వ్యతిరేకంగా పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబర్ 31న ఎల్గార్ పరిషత్ కారణంగానే భీమా-కోరేగావ్‌లో హింస చెలరేగిందని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా కేసు విచారణ సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చిన తర్వాత పోలీసులు మీడియా సమావేశం నిర్వహించడంపై ఈ నెల 6వ తేదీన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ముందస్తు కుట్రతోనే భీమా-కోరేగావ్ హింసాకాండ చోటుచేసుకున్నదని, దీనిలో ప్రధాన నిందితులు ఎక్బొటె, బిడే అని తేల్చిన పుణె డిప్యూటీ మేయర్ సిద్ధార్థ్ దండే నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ మంగళవారం తన నివేదికను పోలీసులకు అందజేసింది.

190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles