సీజేఐ తీర్పును ధిక్కరించలేం..


Wed,May 22, 2019 02:02 AM

Supreme Court dismisses PIL seeking 100 Percentage matching of VVPAT slips with EVMs

- ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించొద్దు
- అర్థరహితమైన వ్యాజ్యంతో చికాకు పెట్టొద్దు
- అందుకు ఇది తగిన సమయం కాదు
- అన్ని వీవీప్యాట్లను లెక్కించాలన్న పిల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం


న్యూఢిల్లీ, మే 21: గురువారం జరిగే లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని వీవీప్యాట్లలోని మొత్తం (100 శాతం) స్లిప్పులను ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చాలని కోరుతూ చెన్నైకి చెందిన టెక్4ఆల్ అనే సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఓట్ల లెక్కింపునకు రెండ్రోజుల సమయం మాత్రమే ఉన్నదని, ప్రభుత్వాన్ని ఎంచుకునేందుకు దేశానికి వీలు కల్పించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరిపి తీర్పును వెలువరించిన విషయాన్ని వెకేషన్ బెంచ్ గుర్తుచేస్తూ.. తాజా పిల్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ (సీజేఐ) ఇప్పటికే విచారణ జరిపారు. అయినప్పటికీ మీరు ఇదే అంశంతో మా ముందుకు ఎందుకు వచ్చారు.

ఇటువంటి కేసులను మేము అత్యవసర విచారణకు స్వీకరించే ప్రసక్తే లేదు. సీజేఐ తీర్పును మేము ధిక్కరించలేము. అర్థరహితమైన పిటిషన్‌తో మీరు చికాకు పెడుతున్నారు అంటూ వెకేషన్ బెంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ పిల్‌ను అత్యవసర విచారణకు స్వీకరించేందుకు నిరాకరించడమే కాకుండా దానిని డిస్మిస్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు విడుతలు ముగియడంతో ఈ నెల 23న కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం దేశం ఎదురు చూస్తున్నదని ధర్మాసనం గుర్తుచేస్తూ.. ఈ పిల్ దాఖలుకు ఇది సరైన సమయం కాదని, అంతిమ ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగడం మినహా ఈ వ్యాజ్యం వల్ల ఒరిగేదేమీ ఉండదని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలలోని ఓట్లతో సరిపోల్చే వీవీప్యాట్లను సగానికి (50 శాతానికి) పెంచాలని 21 ప్రతిపక్ష పార్టీల నేతలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 7న తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

బెంగాల్‌లో పరిశీలకుల నియామకంపై పిటిషన్ తిరస్కృతి

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో పరిశీలకుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పశ్చిమ బెంగాల్‌కు ఇద్దరు పరిశీలకులు అవసరం లేదని పేర్కొంటూ ఆ రాష్ట్రంలోని బారక్‌పోర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి రాము మండీ పిటిషన్ దాఖలు చేశారు.

208
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles