అయోధ్యపై 18లోపు నివేదిక ఇవ్వండి!


Fri,July 12, 2019 02:32 AM

Submit report by 18 July Supreme Court tells panel on Ayodhya case

- మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశం
- అదేరోజున తదుపరి ఉత్తర్వులిస్తాం..
- జూలై 25 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని వ్యాఖ్య


న్యూఢిల్లీ, జూలై 11: అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం సమస్య పరిష్కారంలో పురోగతిపై నివేదికను అందజేయాలని మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఈ నెల 18నాటికి మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతిపై నివేదికను ఇవ్వాలని సూచించింది. ఒకవేళ మధ్యవర్తిత్వ ప్రక్రియ అవసరంలేదనిపిస్తే, తదుపరి ఉత్తర్వుల్ని అదే రోజు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. అవసరమైతే ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని స్పష్టంచేసింది. అయోధ్య భూ వివాదంపై నివేదికను మధ్యవర్తిత్వ కమిటీ జూలై 18నాటికి సమర్పించాలి. తదుపరి ఉత్తర్వుల్ని అదే రోజున ఇస్తాం అని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అయోధ్య భూ వివాదంలో మధ్యవర్తిత్వ ప్రక్రియ చాలని అనిపిస్తే, అదేరోజున తగిన ఆదేశాలు ఇచ్చి.. ఈ అంశంపై విజ్ఞప్తులను స్వీకరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అయోధ్య భూ వివాదంలో మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కన్పించట్లేదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

ఈ పిటిషన్‌ను రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి అవకాశముంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్.ఎం.ఖలీఫుల్లా నేతృత్వం వహిస్తుండగా ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీరావ్‌ు పంచు సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఇటీవల సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికను సమర్పించింది. అయితే సామరస్య పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరింది. దీంతో ఆగస్టు 15వరకు న్యాయస్థానం గడువు కల్పించింది. అయితే, మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కన్పించట్లేదంటూ గోపాల్‌సింగ్ విశారద్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు కమిటీకి జూలై 18తేదీని గడువుగా విధించింది.

282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles