పునఃసమీక్ష కుదరదుTue,January 10, 2017 02:51 AM

-బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టు

బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ట్రిబ్యునల్ తీర్పును పునః సమీక్షించలేమని, రాష్ర్టాలు విడిపోయిన ప్రతీసారి నీటి కేటాయింపులు మార్చడం సాధ్యపడదని పేర్కొంది. తెలంగాణ వాదనను వినిపించేందుకు సరైన వేదికే లేకుండా పోయిందని న్యాయవాది వైద్యనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: కృష్ణా జలాల పంపిణీపై సుప్రీంకోర్టులో తెలంగాణకు నిరాశే ఎదురైంది. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇటీవల వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు అన్యాయం జరిగినందున దాన్ని పునః సమీక్షించాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర ఏర్పాటు ప్రధాన లక్ష్యాల్లో నీటి వాటాలో అన్యాయం సరిదిద్దడం ప్రధానాంశమని ధర్మాసనానికి వినిపించినా న్యాయం లభించలేదు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వినిపించడానికి తగిన వేదిక లేకుండా పోయిందని సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వ్యాఖ్యానించారు.
supreme
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 పరిధి కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు సంబంధించినది మాత్రమేనని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ధారిస్తూ కర్ణాటక, మహారాష్ట్ర కేటాయింపులకు విఘాతం కలుగరాదని రెండు నెలల క్రితం తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ గత నెలలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయగా జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ పీసీ పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్వచించాల్సి ఉందన్నారు.

అయితే ట్రిబ్యునల్ సెక్షన్ 89 పరిధిని తెలంగాణ, ఏపీకే పరిమితం చేయడంతో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి తగిన న్యాయం లభించలేదన్నారు. కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ జోక్యం చేసుకుని, కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లపై విచారణ జరుగుతున్నందున, వాటికి దీనిని జోడించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వైద్యనాథన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పిటిషన్ల స్వభావం వేరన్నారు. ప్రస్తుత విచారణాంశం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89పై ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పుకు సంబంధించినదన్నారు.

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 84, 84(3) తెలంగాణ, ఏపీ రాష్ర్టాల జలాల వివాదాలకు,అపెక్స్ కౌన్సిల్‌కు సంబంధించినదని, కానీ సెక్షన్ 89 ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు, ఆపరేషన్ ప్రోటోకాల్‌కు సంబంధించినదని చెప్పారు. నాలుగు రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ సెక్షన్ స్ఫూర్తికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ దశలో జస్టిస్ మదన్ బీ లోకూర్ జోక్యం చేసుకుని, అన్ని రాష్ర్టాలకు జరిగిన నీటి కేటాయింపులను మళ్ళీ సమీక్షించి పునః కేటాయింపులు చేపట్టాలా? అని ప్రశ్నించారు. దీనికి వైద్యనాథన్ ఔను అని సమాధానం ఇచ్చారు.

దీనికి జస్టిస్ లోకూర్ జోక్యం చేసుకుని, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో విడిపోయి తెలంగాణ-ఏ, తెలంగాణ-బీ గా విడిపోతే మళ్ళీ నీటి పంపకాలను మొదటి నుంచీ చేపట్టాలా? మళ్ళీ అన్ని రాష్ర్టాల నీటి పంపకాలను సమీక్షించాల్సి ఉంటుందా అని ప్రశ్నించారు. వైద్యనాథన్ వివరణ ఇస్తూ తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణాల్లో నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయం ఒకటని చెప్పారు. వాదనల అనంతరం జస్టిస్ మదన్ బీ లోకూర్ స్పందిస్తూ రాష్ర్టాలు విడిపోయిన ప్రతీసారి ట్రిబ్యునల్ తీర్పులను పునః సమీక్షించలేమని, కేటాయింపులను మార్చలేమని వ్యాఖ్యానించారు. సెక్షన్ 89పై ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పును పునః సమీక్షించలేమని వ్యాఖ్యానించిన జడ్జి తెలంగాణ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.

467
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS