ఆధ్యాత్మికవేత్త భయ్యూ మహరాజ్ ఆత్మహత్య


Wed,June 13, 2018 03:50 AM

Spiritual leader Bhaiyyuji Maharaj commits suicide

-తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం
-ఒత్తిడితో విసిగిపోయానని సూసైడ్ నోట్
-భయ్యూ శిష్యులుగా సినీ, రాజకీయ ప్రముఖులు
-గతంలో మోడలింగ్ రంగంలో భయ్యూ
bhaiyyu-maharaj
ఇండోర్, జూన్ 12: మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మికవేత్త భయ్యూ మహరాజ్ అలియాస్ ఉదయ్‌సింగ్ దేశ్‌ముఖ్ మంగళవారం ఉదయం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఐదుగురు సన్యాసులకు సహాయ మంత్రి హోదా ప్రకటించిన వారిలో భయ్యూ మహరాజ్ కూడా ఉన్నారు. కానీ ఆయన ఆ హోదాను స్వీకరించేందుకు నిరాకరించారు. మంత్రి పదవి వల్ల తమ వంటి సన్యాసులకు ఒరిగేదేమీ లేదని పెదవి విరిచారు. ఇంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్ర ప్రజల్ని నిర్ఘాంతపరిచింది. భయ్యూ మహరాజ్ తన ఇంటిలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు అని ఇండోర్ డీఐజీ హెచ్‌సీ మిశ్రా తెలిపారు. మరో పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ భయ్యూ మహరాజ్ దేవాలయంలోని తన గదిలో కాల్చుకుని పడిపోయారన్నారు. గది తలుపులు పగులగొట్టి ఆయనను బయటకు తీసి, దవాఖానకు తీసుకెళ్లామని, కానీ అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారని చె ప్పారు. ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పిన కారణాలు పూర్తిస్థాయి దర్యాప్తులోనే వెలుగులోకి వస్తాయన్నారు. కా గా, ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు ప్రభుత్వ ఎంవై దవాఖానకు తరలించారు.

విసిగిపోయి నేను వెళ్లిపోతున్నా: భయ్యూ గదిలో ఒక ఆయన వాంగ్మూలం రాసిన కాగితం దొరికిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒత్తిడితో విసిగిపోయి నేను వెళ్లిపోతున్నా. ఎవరో ఒకరు నా కుటుంబ బాధ్యతలు చేపట్టాలి అని దాంట్లో రాసి ఉంది. కుటుంబ సభ్యులు అది ఆయన చేతిరాతేనని చెబుతున్నారు. దీన్ని నిపుణులతో ధ్రువీకరించాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు. భయ్యూ ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో ఆయన అభిమానులు వద్దకు చేరుకున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో భయ్యూ మహరాజ్ చేపట్టిన ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆశీస్సులు పొందేవారు.

మోడలింగ్ నుంచి భక్తిమార్గంలోకి..

భయ్యూ మహరాజ్ ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు ఒక సంస్థ దుస్తులకు మోడల్‌గా వ్యవహరించారని ఆయన సహచరులు చెబుతారు. ఆధ్యాత్మిక వేత్తగా మారినా విలాసాలను ఆయన వదిలి పెట్టలేదు. మెర్సిడెస్ కారులోనే ప్రయాణించేవారు. ఖరీదైన రోలెక్స్ గడియారం లేకుండా అరుదుగా కనిపించేవారు. 2016లో పుణెలో ఉన్న తన కూతురును కలిసి తిరిగి వస్తుండగా జరిగిన దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. ఈ దాడిలో గాయపడిన భయ్యూ మహరాజ్‌ను పరామర్శించేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ తదితరులు ఆయన నివాసానికి వెళ్లారు.

2075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles