మహా కూటమితో వారికి ఓటమే!


Sun,January 13, 2019 02:49 AM

SP and BSP came together for their survival they cannot take on Modi alone

-బలహీన ప్రభుత్వం ఏర్పాటుకే విపక్షాలు ఏకం
-దేశ చరిత్రలో మచ్చలేని ప్రభుత్వం మాదే
-చౌకీదార్ ఎవ్వరినీ వదిలిపెట్టడు: ప్రధాని మోదీ
-అదొక విఫల ప్రయోగం
-అవినీతి కోసమే విపక్షాలు ఏకం
-సుస్థిర పాలన, బలమైన సర్కారే మా లక్ష్యం
-బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జనవరి 12: బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమిపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. మహాకూటమి ఓ విఫల ప్రయోగంగా అభివర్ణించారు. పక్షపాతం, అవినీతిని ప్రోత్సహించేందుకు బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం సమగ్రాభివృద్ధి కోసం బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నదని చెప్పారు. రామ మందిరం వివాదం విషయంలోనూ కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు. అయోధ్య వివాదం పరిష్కారం కాకుండా తమ లాయర్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, ఆ పార్టీ సంస్కృతికి వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీలు నేడు అదే పార్టీతో చేతులు కలుపుతున్నాయని ఆయన విమర్శించారు. అవినీతికి ముగింపు పలికేందుకు బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. మహాకూటమి పేరుతో నేడు దేశంలో ఓ విఫల ప్రయోగం జరుగుతున్నదని, బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారంతా ఏకమవుతున్నారని విమర్శించారు.

తమ దుకాణాలు మూతపడతాయనే వారు బలమైన ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదని ఎద్దేవా చేశారు. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ పొత్తు కుదర్చుకున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలపై ఆయన విమర్శలు గుప్పించారు. సీబీఐ అంటే ఎందుకు భయపడుతున్నారని, ఏయే అక్రమాలకు పాల్పడ్డారని ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులను ప్రశ్నించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి యూపీఏ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో కొన్నేండ్ల పాటు తనను వేధింపులకు గురిచేసినప్పటికీ రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశంపై నిషేధం విధించలేదని చెప్పారు. తదుపరి ప్రధాన సేవకుడిగా నిజాయితీపరుడు, కష్టపడే వ్యక్తి కావాలా లేక అవినీతిపరులు, అవసరమైన సమయాల్లో అందుబాటులో లేకు ండా విహారయాత్రలకు వెళ్లే వారు కావాలా అనేది దేశ ప్రజలే తేల్చుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

చౌకీదార్ ఎవ్వరినీ వదిలిపెట్టడు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం నవ భారత విశ్వాసాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఎవరి హక్కులనూ హరించబోదని నొక్కిచెప్పారు. ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకపోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అవినీతి లేకుండా దేశాన్ని పాలించొచ్చని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది. మునుపటి ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టింది. అవినీతి, కుంభకోణాలతో 2004-14 మధ్య దేశం పదేండ్ల విలువైన సమయాన్ని కోల్పోయిందిఅని మోదీ వ్యాఖ్యానించారు. ఈ చౌకీదార్‌కు ఎదురులేదని, ఏ ఒక్కరినీ విడిచిపెట్టడని, ఇది ఆరంభం మాత్రమే అని స్పష్టం చేశారు.

ప్రతికూల ఫలితాలతో విశ్వాసం కోల్పోవద్దు : అమిత్‌షా

మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలతో విశ్వాసం కోల్పోవద్దని, వచ్చే లోక్‌సభ ఎన్నికలు పార్టీకి అతి ముఖ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మూడు రాష్ర్టాల ఎన్నికల్లో మన ప్రత్యర్థులు గెలిచారు. కానీ మనం ఓడిపోలేదు. ఫలితాలు సంతృప్తికరంగా లేవు. కానీ మనం మన స్థానాన్ని కోల్పోలేదు. ఈ ఫలితాలతో కార్యకర్తలు విశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయిందే.. దాన్ని ఓటమి అంటారు అని షా పేర్కొన్నారు.

modi2

సుస్థిరత, అస్థిరత మధ్యే పోటీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సుస్థిరత, అస్థిరత మధ్యే పోటీ అని బీజేపీ జాతీయ సమ్మేళనం పేర్కొంది. ఈ మేరకు సమావేశాల చివరన ఓ తీర్మాన పత్రాన్ని విడుదల చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి పార్టీ కార్యకర్తలు సరైన పాఠాలు నేర్చుకోవాలని ఆ తీర్మానం సూచించింది. సుస్థిరత లేక అస్థిరత.. నిజాయితీ, దైర్యవంతుడైన ప్రధాని మోదీయా లేక నాయకుడే లేని అవకాశవాద కూటమా.. బలమైన ప్రభుత్వమా లేక బలహీన ప్రభుత్వమా అనేది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేల్చుకోవాలని సూచించింది. మహాకూటమిని హాస్యకూటమిగా అభివర్ణించింది. అది ప్రధాని, బీజేపీ, ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న నిరాశవాద, విరుద్ధ, అవకాశవాద కూటమి అని విమర్శించింది. దానికి అజెండానూ లేదు, నాయకుడూ లేడని ఎద్దేవా చేసింది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మోదీ విజన్‌కు మద్దతునివ్వాలని ఓటర్లను అభ్యర్థించింది.

934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles