ఎస్పీ-బీఎస్పీ పొత్తు


Sun,January 13, 2019 02:55 AM

SP and BSP announce tie up for Lok Sabha polls

-చెరో 38 స్థానాల్లో పోటీ.. కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి
-అమేథీ, రాయబరేలీ స్థానాలు మాత్రం కాంగ్రెస్‌కేనన్న అఖిలేశ్, మాయావతి
-కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి
-వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించగలమని ధీమా
-ఎస్పీ-బీఎస్పీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న రాహుల్
-అవినీతి-గూండాయిజం పొత్తుగా వర్ణించిన బీజేపీ
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకనాటి ప్రత్యర్థి పక్షాలు సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు చేతులు కలిపాయి. కాంగ్రెస్ పార్టీని దూరంపెట్టి ఈ రెండు పార్టీలు యూపీలోని 80 సీట్లకుగాను చెరో 38 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయబరేలీ స్థానాల్లో మాత్రం పోటీ చేయరాదని నిశ్చయించాయి. మిగిలిన రెండు స్థానాలను అజిత్‌సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లక్నో/న్యూఢిల్లీ, జనవరి 12: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకప్పుడు కత్తులు దూసుకున్న సమాజ్‌వాదీ, బహుజన్‌సమాజ్‌వాదీ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నాయి. రెండు పార్టీల అధినేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ ఈ మేరకు శనివారం లక్నోలో సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ సీట్లకుగాను చెరో 38 స్థానాల్లో పోటీ చేయాలని మిగిలిన నాలుగింటిలో రెండో కాంగ్రెస్‌కు, మరో రెండు ఇతర పార్టీలకు వదిలివేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తమ కూటమిలో కాంగ్రెస్‌ను కలుపుకోవద్దని నిర్ణయించినప్పటికీ అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో మాత్రం తమ అభ్యర్థులను పోటీ పెట్టరాదని ఎస్పీబీఎస్పీ నిర్ణయించాయి. ఆ రెండు స్థానాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ (అమేథీ), యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ (రాయ్‌బరేలీ) ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బువా (మేనత్త), భతీజా (మేనల్లుడు)గా పేరొందిన మాయావతి, అఖిలేశ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విలేకరుల సమావేశం అనంతరం గురు-చేలా (గురుశిష్యులు నరేంద్రమోదీ, అమిత్‌షా)లకు ఇక నిద్ర పట్టదు అని అన్నారు. లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించినట్టుగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాషాయ పార్టీని తమ కూటమి మట్టి కరిపించగలమన్న విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. గత (2014) లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలు గెలుపొందగా, దాని మిత్రపక్షం అప్నాదళ్ రెండు సీట్లను గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఐదు, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకోగా, బీఎస్పీ ఎక్కడా గెలుపొందలేదు.

akhilesh-maya2

కాంగ్రెస్‌తో పొత్తు వల్ల లాభం లేదు

తమ కూటమిలో కాంగ్రెస్ పార్టీని చేర్చుకోకవడంపై మాయావతి వివరణ ఇస్తూ, ఆ పార్టీ పాలనలో పేదరికం, నిరుద్యోగం, అవినీతి భారీగా పెరిగిపోయాయని, రక్షణ ఒప్పందాలలో కుంభకోణాలు జరిగాయని చెప్పారు. బోఫోర్స్ కుంభకోణం కాంగ్రెస్‌ను ముంచిందని, రాఫెల్ కుంభకోణం వల్ల బీజేపీకి కూడా అదే గతి పడుతుందని ఆమె చెప్పారు. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల తమ పార్టీ లాభపడలేదని అన్నారు. తమ పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయని, కానీ ఆ పార్టీ ఓట్లు తమకు పడలేదని తెలిపారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎస్పీ ఇదే పరిస్థితిని ఎదుర్కొందని చెప్పారు. ఎస్పీకి కాంగ్రెస్ పార్టీ ఓట్లు బదిలీ కాలేదన్నారు. కానీ ఎస్పీ-బీఎస్పీ పొత్తులో ఓట్ల బదిలీ కచ్చితంగా జరిగిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించిందని, ప్రస్తుతం బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని అన్నారు. మీది సహజమైన పొత్తేనా? అని విలేకరులు ప్రశ్నించగా, ఈ పొత్తు లోక్‌సభతోపాటు వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ప్రధానమంత్రి పదవికి మాయావతికి మద్దతు పలుకుతారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా, నేనెవరికి మద్దతునిస్తానో మీకు తెలుసు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎన్నికైన వారే దేశానికి ప్రధాని కావటం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా అలా జరిగితే నాకు సంతోషమేఅని చెప్పారు. అయితే తామిద్దరం లోక్‌సభకు పోటీ చేసే విషయమై మాత్రం వారు స్పష్టతనివ్వలేదు.

akhilesh-maya3

పీఎస్‌పీఎల్‌ను పోషిస్తున్న బీజేపీ

సమాజ్‌వాదీ పార్టీ నుంచి విడిపోయి ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ లోహియా (పీఎస్‌పీఎల్)ను స్థాపించిన ములాయం సోదరుడు శివపాల్ యాదవ్‌పై బీజేపీ భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నదని మాయావతి ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకే పీఎస్‌పీఎల్‌ను పోషిస్తున్నదని చెప్పారు. 1995లో జరిగిన గెస్ట్‌హౌస్ ఘటనను తాను దేశ ప్రయోజనాల కోసం మరిచిపోయానని అన్నారు. నాటి ఘటనలో ఎస్పీ కార్యకర్తలు మాయావతి బసచేసిన అతిథిగృహంపై దాడి చేశారు. గతంలో కూడా బీఎస్పీ-ఎస్పీ కూటమి విజయవంతమైందని, ఈసారి కూడా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) దుర్వినియోగం జరుగకపోతే బీజేపీని నిలువరిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యకర్తలు మాయావతికి తగిన గౌరవం ఇవ్వాలని అఖిలేశ్ కోరారు. మాయావతిని గౌరవిస్తే నన్ను గౌరవించినట్టు.. ఆమెను అవమానిస్తే నన్ను అవమానించినట్టేనని ఆయన అన్నారు. మాయావతి వ్యాఖ్యలపై శివపాల్ స్పందిస్తూ, గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని అన్నారు.

పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగుతాం: రాహుల్

యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుబాయ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ-బీఎస్పీ నేతలు తీసుకున్న నిర్ణయం పట్ల తనకు అపూర్వ గౌరవం ఉందని చెప్పారు. అయితే ఉత్తరప్ర దేశ్‌లో తాము పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగుతామని తెలిపారు. మరోవైపు ఎస్పీ-బీఎస్పీ పొత్తుపై కాంగ్రెస్ యూపీ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో మాట్లాడుతూ, ఇప్పుడే తాము ఏమీ చెప్పలేమని అన్నారు. లక్నోలో ఆదివారం తమ స్పందనను సవివరంగా తెలియజేస్తామని చెప్పారు. అంతకుముందు ఆయన యూపీపీసీ చీఫ్ రాజ్‌బబ్బర్, యూపీ సీఎల్పీ నాయకుడు సంజయ్‌సింగ్, మాజీ ఎంపీ ప్రమోద్‌తివారీతో తన ఇంట్లో సమావేశమయ్యారు. మరోవైపు భోపాల్‌లో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మాట్లాడుతూ, బీజేపీని ఓడించేందుకు దేశమంతా పొత్తులు ఉండాలని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 31 శాతం ఓట్లు వచ్చాయని, అయినా అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని, కేవలం ఓట్లు చీలిపోవడం వల్లనే అది జరిగిందని కమల్‌నాథ్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను కూడగడుతున్న కాంగ్రెస్‌కు ఎస్పీ-బీఎస్పీ ప్రత్యేక పొత్తు పెద్ద ఎదురుదెబ్బ కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ఎస్పీ-బీఎస్పీ పొత్తును తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఆర్జేడీ స్వాగతించాయి.

ఉనికి కోసమే ఒక్కటయ్యారు:బీజేపీ

ఎస్పీ, బీఎస్పీలు కేవలం ఉనికి కోసమే పొత్తు పెట్టుకున్నాయని, వారి పొత్తు దేశం లేదా ఉత్తర్‌ప్రదేశ్ ప్రయోజనాల కోసం కాదని బీజేపీ విమర్శించింది. ఒంటరిగా మోదీని ఓడించలేమని ఆ పార్టీలకు తెలుసని, ఆయనపై వ్యతిరేకతే ఆ పార్టీల పొత్తుకు మూలమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎస్పీ-బీఎస్పీల పొత్తుపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య స్పందిస్తూ అవినీతి-గూండాయిజం పొత్తు పెట్టుకున్నాయి అని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటముల వల్ల యూపీలో నియంతృత్వం, అవినీతి, రాజకీయ అస్థిరత రాజ్యమేలుతాయని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఎస్పీ-బీఎస్పీది పాపపు కూటమి అని బీజేపీ యూపీ చీఫ్ మహేంద్రనాథ్ పాండే వ్యాఖ్యానించారు.

akhilesh-maya4

25 ఏండ్ల తర్వాత చెట్ట్ట్టపట్టాల్

-1993లో ఎస్పీ-బీఎస్పీల మధ్య తొలిసారి చెలిమి
-1995లో మాయావతిపై దాడి నేపథ్యంలో పెరిగిన అంతరం
-మోదీని ఎదుర్కొనేందుకు మళ్లీ చేతులు కలిపిన మేనత్త-అల్లుడు

సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్త పొత్తు పొడిచింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే విషయం మరోసారి రుజువైంది. రెండున్నర దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి బువా (మేనత్త), భతీజా (మేనల్లుడు)గా పేరొందిన మాయావతి, అఖిలేశ్ చేతులు కలిపారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల బరిలో కలిసి పోటీచేయాలని వారు నిర్ణయించారు.

నేపథ్యమిదీ..

రామ మందిరం ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తొలిసారి 1993 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం, ఎస్పీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి 176 సీట్లు వచ్చాయి. బీజేపీ 177 స్థానాల్లో విజయం సాధించింది. అప్పటి యూపీ అసెంబ్లీలో (ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడకముందు) మొత్తం 424 సీట్లు ఉండేవి. మెజార్టీకి 213 స్థానాలు కావాలి. దీంతో జనతాదళ్ (27), కాంగ్రెస్ (28), వామపక్షాలు (4) మద్దతుతో ఎస్పీ-బీఎస్పీ తొలి సంకీర్ణ సర్కారు ఏర్పడింది. అయితే, 1995లో మాయావతిపై జరిగిన దాడి అనంతరం వీరి పొత్తు కేవలం ఏడాదిన్నరకే విచ్ఛిన్నమైంది.

1995లో అతిథిగృహంలో ఏం జరిగింది?

1995 జూన్‌లో ములాయంసింగ్ సర్కారుకి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. దీంతో ములాయం ప్రభుత్వం మైనార్టీలో పడింది. లక్నోలోని మీరాబాయ్ మార్గ్ అతిథిగృహంలో బీఎస్పీ ఎమ్మెల్యేలతో మాయావతి సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తల గుంపు అక్కడికి చేరుకుని అలజడి సృష్టించింది. మాయావతి గదిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆమెను అసభ్యపదజాలంతో దూషిస్తూ కొందరు దాడి చేశారు. అడ్డుకోబోయిన బీఎస్పీ ఎమ్మెల్యేలను సైతం తరిమికొట్టారు. అయితే, బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది ధైర్యంగా అక్కడికి చేరుకుని అల్లరి మూకల గుంపు నుంచి మాయావతిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ ఘటనను అవమానకరంగా భావించిన మాయావతి ఎస్పీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు. అనంతరం బీజేపీ మద్దతుతో తొలిసారి మాయావతి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి ఉప్పునిప్పుగా ఉన్న ఎస్పీ-బీఎస్పీ మళ్లీ 23 ఏండ్ల తర్వాత చేతులు కలిపాయి. యూపీలో ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్, పుల్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ భేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు బీజేపీపై ఘనవిజయం సాధించారు.

కూటమి ప్రభావం ఎంత?

2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ కేవలం ఐదు స్థానాల్లోనే గెలిచింది. బీఎస్పీ తన ఖాతా కూడా తెరువలేదు. కానీ రెండు పార్టీలకు చెరో 22 శాతం ఓట్లు వచ్చాయి. యూపీలో దళితులు 22 శాతం, ఓబీసీలు 45 శాతం, ముస్లింలు 19 శాతం ఉన్నారు. దళితుల్లో మెజార్టీ ప్రజలు బీఎస్పీకి అండగా ఉంటున్నారు. ఇక యాదవ్-ముస్లిం వర్గాలు ఎస్పీకి పెట్టనికోటగా ఉంటున్నాయి. రెండు పార్టీల కలయికతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవచ్చనేది వీరి ధీమా.

up-congress

బీజేపీ ఓట్ల ఏకీకరణ వ్యూహాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్‌ను చేర్చుకోలేదా?

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓట్ల ఏకీకరణ జరిగి బీజేపీ లాభపడకుండా చూడటం కోసం ఎస్పీ-బీఎస్పీ ఒక వ్యూ హం ప్రకారం కాంగ్రెస్‌ను తమ కూటమికి దూరంగా ఉంచినట్టు తెలుస్తున్నది. యూపీలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీయే కేంద్రంలోనూ కీలక పాత్ర పోషించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే, బీజేపీని ఓడించేందుకు కూటమిగా ఏర్పడటంలో ఎస్పీ-బీస్పీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. రాబోయే ఎన్నికలను మోదీకి ఇతర పార్టీలకు మధ్య పోటీగా బీజేపీ ఇప్పటికే ప్రచారం చేస్తున్నది. తద్వారా వచ్చే ఎన్నికలు హిందువులకు, ఇతర వర్గాల వారికి మధ్య పోటీగా విభజిస్తూ ఓట్ల ఏకీకరణకు ప్రయత్నిస్తున్నది. కేవలం మోదీని ఓడించేందుకే ఇతర పార్టీలన్నీ ఒక్క కూటమిగా ఏర్పడుతున్నాయని బీజేపీ ఆరోపిస్తున్నది. ఆ విధంగా ఓటర్లు ఏదో ఒక పక్షాన్ని ఎంచుకొనే పరిస్థితిని సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో తమ కూటమిలో కాంగ్రెస్‌కు స్థానం కల్పిస్తే బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చినట్టు అవుతుందని ఎస్పీ-బీఎస్పీ భావించినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ కూడా విడిగా బరిలోకి దిగితే కులాలు, మతాల వారీగా ఓట్లు చీలిపోతే లాభపడవచ్చన్నది ఈ మూడు పార్టీల ఎత్తుగడగా కనిపిస్తున్నది.

627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles