రంగంలోకి దిగిన సోనియా


Fri,May 17, 2019 01:46 AM

Sonia Gandhi invites non NDA parties for meet on May 23

- ఎన్డీయేయేతర పార్టీలకు లేఖలు రాసిన యూపీఏ చైర్‌పర్సన్
- ఫలితాలు వెలువడే మే 23నే ప్రతిపక్ష సమావేశం
- ప్రధాని పదవికి ప్రాంతీయ నేతలకైనా మద్దతిస్తామన్న ఆజాద్


న్యూఢిల్లీ, మే 16: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేనట్టు పలు సర్వే నివేదికలు వెల్లడించిన నేపథ్యలో.. ఫలితాల అనంతరం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోమారు అధికారానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అదే రోజున ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆమె ఢిల్లీలో ఈ నెల 23న జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలందరికీ లేఖలు రాసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంలో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు గాను ఒక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగానే సోనియా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జనతాదళ్ (సెక్యూలర్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ, ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు సోనియా లేఖలు రాశారని పార్టీ వర్గాలు తెలిపాయి. తృణమూల్, ఆర్జేడీ నేతలను కూడా ఆమె ఆహ్వానించినట్టు పేర్కొన్నాయి.

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఫలితాల అనంతరం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో ఎన్డీయేయేతర పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేలా కాంగ్రెస్ తన ప్రయత్నాలను ప్రారంభించిందన్న సంకేతాన్ని ఇచ్చేందుకే సోనియాగాంధీ ఈ లేఖలు రాశారని పరిశీలకులు భావిస్తున్నారు. ఫలితాల అనంతరం భావ సారూప్యతగల పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసేందుకు పార్టీ సీనియర్ నేతలు పీ చిదంబరం, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌తో కాంగ్రెస్ పార్టీ ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఏ కూటమిలోనూ లేని పార్టీలను ముందుగా తమ వైపు తిప్పుకోవాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని తెలుస్తున్నది. మరోవైపు, ఫలితాలనంతరం తాము అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రధాని పదవి కోసం ఏదైనా ప్రాంతీయ పార్టీ నాయకుడి పేరును ప్రతిపాదించడానికి వెనుకడుగు వేయమని ఆజాద్ ప్రకటించారు.

339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles