దావానలం


Thu,October 11, 2018 02:56 AM

Soli Sorabjee was harassed me says junior lawyer

-సొలిసొరాబ్జీ నన్ను వేధించారు: మహిళా లాయర్
-ఆమె చాలామందిపై అలాంటి ఆరోపణలు చేసిందన్న సొరాబ్జీ
-అలోక్‌నాథ్ నన్ను కూడా వేధించారు : టీవీ తారలు సంధ్యామృదుల్, నవనీత్ నిషాన్
-కైలాశ్‌ఖేర్‌పై గాయని సోనా మహాపాత్ర ఆరోపణలు
-విస్తరిస్తున్న మీటూ ఉద్యమం .. లైంగిక వేధింపులపై గళం విప్పుతున్న మహిళలు
లైంగిక వేధింపులపై తిరుగుబాటు ఉద్యమం మీటూ (నేనూ బాధితురాలినే) ప్రకంపనలు సృష్టిస్తున్నది. తాజాగా మాజీ అటార్నీ జనరల్ సొలిసొరాబ్జీకి వ్యతిరేకంగా ఓమహిళా న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇక బాలీవుడ్ నటుడు అలోక్‌నాథ్‌పై మరో ఇద్దరు టీవీ తారలు ఆరోపణలకు దిగగా, ఇప్పటికే ఓ జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పిన గాయకుడు కైలాశ్‌ఖేర్.. తననూ వేధించాడని గాయని సోనా మహాపాత్ర బయటపెట్టారు.

సొలి సొరాబ్జీ పలుమార్లు వేధించారు

soli-sorabji
మాజీ అటార్నీ జనరల్ సొలిసొరాబ్జీ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఆయన వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన ఓ మహిళ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఆయ న చాలాసార్లు తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. పనిచేసే చోటే కాకుండా, తన వ్యక్తిగత జీవితంలోనూ ఆయన వేధింపులకు పాల్పడ్డారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను బుధవారం సొరాబ్జీ ఖండించారు. నాపై వచ్చిన ఆరోపణలు కల్పితం, నిరాధారం. ఇలా ఆరోపణలు చేయడం ఆమెకు అలవాటే. చాలామందిపై ఈ తరహా ఆరోపణలను ఆమె చేశారు. నేను తప్పు చేసి ఉంటే.. చట్టపరంగా ఏ శిక్షకైనా సిద్ధం. కానీ అవి తప్పుడు ఆరోపణలని తేలితే.. పోయిన నా పరువు తిరిగివస్తుందా? ఆమెను నా వద్ద జూనియర్‌గా పెట్టుకోవడం నేను చేసిన తప్పు అని సొరాబ్జీ తెలిపారు. మీటూ ఉద్యమం వల్ల చాలామంది మహిళలు తమపై జరిగిన వేధింపులను బయట పెడుతున్నారని, అది మంచి పరిణామమమని చెప్పారు.

నేనూ వేధింపులకు గురయ్యాను: అమైరా దస్తూర్

amaira-dasthur
తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించిన అమైరా దస్తూర్.. తనకు ఎదురైన లైంగికవేధింపులను బుధవారం ఓ వార్తాసంస్థకు ఈ-మెయిల్ ద్వారా వెల్లడించారు. ఓ నటుడు సెట్లోనే తనను బలవంతంగా కౌగిలించుకుని నలిపేశాడని, మరో సినిమా దర్శకుడు లైంగికంగా వేధించాడని తెలిపారు. నేను లొంగకపోవడంతో.. నన్ను వారు తీవ్ర వేధింపులకు గురిచేశారు. తెల్లవారుజామునే సెట్‌కు రప్పించి గంటలకొద్దీ వేచి ఉండేలా చేశారు. ఒక్కోరోజు 18గంటల వరకు సెట్లో ఊరికే కూర్చోబెట్టేవారు అని చెప్పిన అమైరా.. వారి పేర్లను వెల్లడించేందుకు నిరాకరించారు. వారు చాలా పలుకుబడి కలిగిన వ్యక్తులని, తాను సురక్షితంగా ఉంటానన్న నమ్మకం ఉన్నప్పుడు వారిపేర్లను వెల్లడిస్తానని ఆమె పేర్కొన్నారు.

ఇక హిందీ నటుడు రజత్‌కపూర్‌పై మరోమహిళ లైంగిక ఆరోపణలు చేశారు. చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం ముంబై లో అడుగుపెట్టినప్పుడు తండ్రి వయసున్న రజత్‌కపూర్ అసభ్యంగా ప్రవర్తించాడని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని మహిళ తెలిపారు. మరోవైపు ఓ విమానయాన ఉద్యోగి తనపై చేసిన ఆరోపణలపై బాలీవుడ్ సింగర్ అభిజిత్ భట్టాచార్య స్పందిస్తూ.. వయసుమళ్లిన, జీవితంలో విజయం సాధించలేకపోయిన మహిళలే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు

కైలాశ్ ఖేర్ నీచుడు: సోనా మహాపాత్ర

kailash-kher
ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ తనను వేధించినట్లు జర్నలిస్టు సంధ్యామీనన్ బయటపెట్టడంతోపాటు, ఆయన పంపిన సందేశాల స్క్రీన్‌షాట్లను కూడా సోషల్‌మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది. తాజాగా గాయని సోనా మహాపాత్ర కూడా కైలాశ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఓ సంగీత కచేరీ విషయమై కైలాశ్‌ను కలుసుకున్నప్పుడు తనపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. అక్కడితో కైలాశ్ తనను వదలలేదని, కచేరీ సందర్భంగా తన గదికి రావాలంటూ ఒత్తిడి చేశాడు అని సోనా వెల్లడించారు. కైలాశ్‌తో కలిసి తాను అనేక పాటలు పాడానని, ఈ సంఘటనతో ఆయన నీచబుద్ధి తెలిసి వచ్చిందని ఆమె చెప్పారు.

అలోక్‌నాథ్‌పై మరో ఇద్దరి ఆరోపణలు

alok-nath
బాలీవుడ్ తెరపై సంస్కారవంతుడైన నటుడిగా కనిపించే అలోక్‌నాథ్ తనపైనా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరో ఇద్దరు టీవీ నటీమణులు ఆరోపణలు చేశారు. పలు టీవీ సీరియళ్లలో నటించిన సంధ్యామృదుల్ తన అనుభవాన్ని బుధవారం ట్విట్టర్‌లో వివరించారు. కొడైకెనాల్‌లో ఓ టెలిఫిలిం షూటింగ్ సందర్భంగా నా హోటల్‌రూమ్‌కు వచ్చిన అలోక్ నాపై లైంగికదాడికి యత్నించాడు. షూటింగ్ ఉన్నన్ని రోజులు అలోక్ నా గదివద్దకు వచ్చి గొడవ చేసేవాడు. ఆ తర్వాత నేను పొగరుబోతునంటూ నాపై ఇండస్ట్రీలో తప్పుడు ప్రచారం చేశాడు అని సంధ్య మండిపడ్డారు. అలోక్ తనను నాలుగేండ్లు వేధించాడని, చివరకు ఆయనకు చెంపదెబ్బతో బుద్ధి చెప్పానని మరో టీవీనటి నవనీత్ నిషాన్ వెల్లడించారు. మరోవైపు తమను లైంగికంగా వేధించారంటూ గాయని చిన్మయి చేసిన ఆరోపణలను ప్రముఖ సినీ పాటల రచయిత వైరముత్తు తోసిపుచ్చారు.

ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: ఎన్సీడబ్ల్యూ

ncw
లైంగిక వేధింపుల బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)సూచించింది. ఈ తరహా ఘటనల్లో బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం వరకే పరిమితమవుతున్నారు. నిందితుల పేర్లను వెల్లడించేందుకు ఎక్కువశాతం మంది వెనుకాడుతున్నారు. మేము బాధితులకు అండగా ఉంటాం అని ఎన్సీడబ్ల్యూ పేర్కొన్నది.

ఫిర్యాదు చేసినందుకు బాధితురాలికి శిక్ష

శ్రీనగర్: లైంగిక వేధింపులకు గురైన వాళ్లు వరుసగా గళం విప్పుతున్న నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన వైద్య విద్యార్థిని కూడా నోరు విప్పింది. అయితే ఆమెపై వేధింపులకు పాల్పడిన నిందితుడితోపాటు, ఆమె కూడా శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. దవాఖాన యాజమాన్యం ఆమెను ఫార్మసీ విభాగం నుంచి తొలిగించింది. కశ్మీర్‌లోని షేర్ ఎ కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎస్‌కేఐఎంఎస్)కు చెందిన విద్యార్థిని ఇటీవల తన తోటి విద్యార్థి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కళాశాలలోని మహిళల వేధింపుల కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ కమిటీ ఇటీవలే దర్యాప్తును పూర్తి చేసింది. కానీ నిందితుడితోపాటు ఫిర్యాదు చేసిన విద్యార్థినిపై కూడాయాజమాన్యం బదిలీ వేటు వేసింది.

ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించిన డాక్టర్ ముదాసిర్ మాట్లాడుతూ ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలపై దర్యాప్తు జరిపామని, కానీ ఎక్కడ కూడా లైంగిక వేధింపులు జరిగినట్లు కనిపించలేదని చెప్పారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని, దర్యాప్తు నివేదికను దవాఖాన సూపరింటెండెంట్ ఫారుఖ్ జైన్‌కు అందజేశానని తెలిపారు. ఫిర్యాదు చేసిన వైద్య విద్యార్థిని మాట్లాడుతూ తనను, నిందితుడిని బదిలీ చేయాలని కమిటీ సూచించడం ఆశ్చర్యంగా ఉన్నదని తెలిపారు. నిందితుడి ఒత్తిడికి దవాఖాన యాజమాన్యం తలొగ్గిందని ఆరోపించారు.

* సినిమా అంటే బైబిల్ రచన కాదు. నీతులు చెప్పడం కన్నా వాస్తవిక చిత్రణకు ప్రస్తుత సినిమాలు అద్దం పడుతున్నాయి. అయితే లైంగిక వేధింపులు ఒక్క సినీరంగానికే పరిమితమై లేవు. సమాజంలో అవి అంతకన్నా దుర్భరంగా ఉన్నాయి.
- గుల్జార్ రచయిత

* పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేక చట్టాలున్నా.. చాలా సంస్థల్లో అవి అమలు కాకపోవడం సిగ్గుచేటు. పురుషులను ఉన్నతులుగా చూపే సంప్రదాయక చట్రాలను ఛేదించుకుని మహిళలు బయటకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం.
- బృందా కారత్, సీపీఎం నేత

903
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles