నౌకాశ్రయాల్లో సౌర విద్యుత్ పరికరాల నిలిపివేతSat,January 13, 2018 02:13 AM

-రూ.953 కోట్ల విలువ గల యంత్రాలను వర్గీకరించాలని కస్టమ్స్ పట్టు
-సమస్యను పరిష్కరించాలని ఆర్థికశాఖను కోరిన సంప్రదాయేతర ఇంధన శాఖ

ports
న్యూఢిల్లీ, జనవరి 12: సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కోసం చైనా నుంచి దిగుమతి చేసుకున్న సౌర విద్యుత్ పరికరాలు దేశంలోని పలు నౌకాశ్రయాల్లోనే చిక్కుబడి పోయాయి. వీటి విలువ రూ.953 కోట్లు (15 కోట్ల డాలర్లు) ఉంటుంది. ఆయా పరికరాలను విద్యుత్ మోటార్లు, జనరేటర్లుగా వర్గీకరించాలని కస్టమ్స్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నై దక్షిణ నౌకాశ్రయంలోని ఇద్దరు కస్టమ్స్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దేశంలోని సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్, గోల్డ్‌మన్ సాచెస్ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. సకాలంలో పరికరాలు సంబంధిత ప్రాంతాలకు తరలించకపోతే వచ్చే ఐదేండ్లలో సంప్రదాయేతర విధానాల్లో 175 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్య సాధన జాప్యం అయ్యే అవకాశం ఉన్నదని అంటున్నారు.

భారత్ సౌర విద్యుత్ సంఘం అధ్యక్షుడు సీ నరసింహన్ మాట్లాడుతూ దేశంలోని నాలుగు నౌకాశ్రయాల పరిధిలో సుమారు 2000 పరికరాలు.. ఓడల్లోనే ఉన్నాయని చెప్పారు. నౌకాశ్రయాల్లోని కస్టమ్స్ అధికారులు కల్పిస్తున్న అంతరాయం వల్ల 2022 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యానికి గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై నౌకాశ్రయంలో మూడు వారాలుగా జర్మనీకి చెందిన ఎనెర్ పార్క్ భారత్ శాఖ 30 విద్యుత్ కంటైనర్లు చిక్కుబడి ఉన్నాయని సంస్థ ఎండీ సంతోష్ ఖాతేల్సాల్ చెప్పారు. వాటి విలువ రూ.70.20 లక్షలు (1,10,471 డాలర్లు) అని తెలిపారు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖను సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ ఇప్పటికే కోరింది. దేశీయ ఉత్పత్తిదారులు, డెవలపర్ల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూడాల్సి ఉన్నదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. పరికరాల తరలింపులో జాప్యం వల్ల సదరు విద్యుత్ ప్రాజెక్టుల వ్యయం పెరిగే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. కానీ దీనిపై స్పందించేందుకు ఆర్థిక, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ అధికార ప్రతినిధులు నిరాకరించారు.

245
Tags

More News

VIRAL NEWS