కుండపోత వానలు


Thu,July 12, 2018 02:07 AM

Six states killed as heavy rains hit 55 people

-ఆరు రాష్ర్టాల్లో భారీ వర్షాలు.. 55 మంది మృతి
-నడుం లోతు నీళ్లలోనే ముంబై
-మహారాష్ట్రలో మరో 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
-వరదలు, కొండచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌లో 11 మంది, మణిపూర్‌లో 9 మంది బలి
-గుజరాత్, అసోం, బెంగాల్‌ను వదలని వాన కష్టాలు

ముంబై/డెహ్రాడూన్/కోల్‌కతా, జూలై 11: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలకు ఆరు రాష్ర్టాల్లో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోం, మణిపూర్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ర్టాల్లో బుధవారం వర్షాల జోరుకు జనజీవనం స్తంభించింది. ఇప్పటికే నడుంలోతు నీటితో జలమయమైన ముంబై మహానగరాన్ని మరో 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ముంచెత్తనున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. రుతుపవనాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో చురుగ్గా విస్తరించి ఉన్నాయని ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

జల వలయంలో ముంబై

ముంబై మహానగరం చిన్నసైజు సముద్రాన్ని తలపిస్తున్నది. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం పూర్తిగా జలమయమైంది. గత 10 రోజుల్లో రికార్డు స్థాయిలో 864.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాలతో జనజీవనం దుర్భరంగా మారింది. వర్షాలధాటికి నగరంతోపాటు సమీపంలోని థానె, పాల్గాఢ్ జిల్లాల్లోని చాలా రహదారులు, నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో జనం నడుంలోతు వరకు నీటిలోనే ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టాలపై భారీగా వర్షపునీరు నిలిచిపోవడంతో లోకల్ రైళ్లన్నీ నిలిపివేశారు. నల్లాస్‌పొరా, వసాయ్ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. చర్చిగేట్ నుంచి భయాందర్ మార్గంలో కేవలం 10 కిలోమీటర్ల వేగంతో మాత్రమే లోకల్ రైళ్లు నడిపిస్తున్నారు. దీంతో వేలాది మంది ప్రయాణికులతో బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. సబర్బన్ పరిధిలో రైల్వేసేవలు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు వర్షాల కారణంగా శతాబ్ది, వడోదర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చిక్కుకుపోయిన 2,000 మంది ప్రయాణికులను జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్), పోలీసులు రక్షించి వారిని ఆయా ప్రాంతాలకు తరలించారు. వర్షాల వల్ల మహారాష్ట్రలో 11 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.

భారీ వరదలకు ఉత్తరాఖండ్‌లో 11 మంది మృతి

భారీ వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్‌లోని సీమాద్వర్‌లో భవనం కూలిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. శాస్త్రినగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు విడిచారు. వరదలకు కొట్టుకుపోయి మరో ముగ్గురు మృతిచెందారు. కొండచరియలు విరిగిపడడంతో జాతీయ రహదారి-94ను పూర్తిగా మూసివేశారు. వర్షాల ధాటికి రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పితోరాగఢ్ జిల్లాలోని నాచిని ప్రాంతంలో వరదలకు తీగల వంతెన కొట్టుకుపోయింది.
Dehradun

కొండచరియలు విరిగిపడి మణిపూర్‌లో 9 మంది మృతి

మణిపూర్ తెమంగ్లాంగ్ పట్టణంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనల్లో 9 మంది చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. గుజరాత్, పశ్చిమబెంగాల్, అసోంలోనూ వర్షాలు భారీగా కురిశాయి. గుజరాత్‌లోని వల్సాద్‌లో రికార్డుస్థాయిలో 135 మిల్లీమీటర్లు, వడోదరలో 55 మి.మీ., దియూలో 50 మి.మీ., సూరత్‌లో 46 మి.మీ.ల వర్షం కురిసింది. భరూచ్ జిల్లాలో ఇద్దరు మరణించారు. అసోంలో భారీ వరదలకు నాలుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వివిధ దుర్ఘటనల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్‌లో పిడుగుపాటుకు గురై ఐదుగురు మరణించారు.

283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS