సిక్కింగ్ ఎవరు?

Fri,March 15, 2019 11:39 AM

-జనాభా: 6,10,577
-విస్తీర్ణం: 7,096 చ.కి.మీ.
-మొత్తం ఓటర్లు: 3,85,287
-పురుషులు: 1,98,637
-మహిళలు: 1,86,645
-ఇతరులు: 5
-అసెంబ్లీ స్థానాలు: 32
-లోక్‌సభ స్థానాలు: 1

న్యూఢిల్లీ: జనాభాపరంగా దేశంలోనే అతిచిన్న రాష్ట్రం, విస్తీర్ణం పరంగా రెండో అతిచిన్న రాష్ట్రం, నేపాల్, భూటాన్, టిబెట్‌లతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన కీలక రాష్ట్రమైన సిక్కిం ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది. నేపాలీ అధికారిక భాషగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. 1975 వరకు కూడా రాచరిక పాలనలోనే ఉన్న సిక్కిం.. ప్రజాతీర్పు మేరకు 1975 ఏప్రిల్ 26న భారత్‌లో అంతర్భాగమైంది. 1979లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, అనంతరం 1984లో నిర్వహించిన ఎన్నికల్లో నార్ బహదూర్ భండారీ నేతృత్వంలోని సిక్కిం సంగ్రామ్ పరిషద్(ఎస్‌ఎస్‌పీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్‌ఎస్‌పీకి 1993లో పవన్ కుమార్ చామ్లింగ్ సారథ్యంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) చెక్‌పెట్టింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్డీఎఫ్‌నే రాష్ట్రంలో ఏకచక్రాధిపత్యం తిప్పుతున్నది. 2009 ఎన్నికల్లో ఈ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 32 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. అయితే ఈసారి ఎస్కేఎం నుంచి ఈ పార్టీకి గట్టిపోటీ ఎదురుకానుంది. మే 23న వెలువడే ఫలితాలతో సిక్కింగ్ ఎవరో తేలనుంది.

చామ్లింగ్.. ఆరోసారి!

ఎస్డీఎఫ్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఉన్నారు. 1994 నుంచి వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో ప్రస్తుతం ఎస్డీఎఫ్‌కి 23 స్థానాలు, సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం)కి 9 స్థానాలు ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఎస్డీఎఫ్ పార్టీకి ఈసారి ప్రతిపక్ష ఎస్కేఎం నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఇండియా టుడే పొలిటికల్ స్టాక్ ఎక్సేంజ్ సర్వే ప్రకారం అధికార ఎస్‌డీఎఫ్.. ఎస్కేఎం కంటే కేవలం ఒక్క శాతం మాత్రమే ఆధిక్యంలో ఉంది. చామ్లింగ్ ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందని 33 శాతం మంది పేర్కొనగా, అసలేం బాగోలేదని 32 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 23 శాతం మంది పర్వాలేదని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి రేసులో పవన్ కుమార్ చామ్లింగే ఇప్పటికీ ముందు వరుసలో ఉండడం విశేషం. సీఎంగా చామ్లింగ్‌కు 44 శాతం మంది ఓటేశారు. మరోవైపు ప్రతిపక్ష ఎస్కేఎమ్ వ్యవస్థాపకులు పీఎస్ గొలాయ్ కూడా చామ్లింగ్‌కు గట్టిపోటీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా గొలాయ్‌కు 42 శాతం మంది మద్దతిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ ప్రధాని మోదీకి మాత్రం ప్రజాదరణ బాగుంది. ప్రధానిగా మోదీకి ఏకంగా 72శాతం మంది మద్దతివ్వడం విశేషం. గతేడాది అక్టోబర్‌లో ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది.

723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles