నిష్పాక్షిక విచారణ జరిపించండి


Tue,August 20, 2019 03:22 AM

Shehla Rashid after army denies claims of rights abuses in Kashmir

-సైన్యంపై తాను చేసిన ఆరోపణలపై షెహ్లా రషీద్ స్పందన
న్యూఢిల్లీ, ఆగస్టు 19: జమ్ముకశ్మీర్‌లో సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో కశ్మీరీ రాజకీయ కార్యకర్త షెహ్లా రషీద్ స్పందించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడే తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తాను తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నానని వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. తన వ్యాఖ్యలను ఆర్మీ ఖండించిన నేపథ్యంలో తాను చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. భద్రతాబలగాలు యువతను విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని, రాత్రిపూట నివాసాల్లోకి ప్రవేశించి ఇంటిని చిందరవందర చేస్తున్నారని, సరకులను ఉద్దేశపూర్వకంగా నేలపై పడేస్తున్నారని షెహ్లాలా రషీద్ ఆదివారం వరుస ట్వీట్లలో ఆరోపించారు.

షోపియాన్‌లో నలుగురిని ఆర్మీ శిబిరానికి తరలించి చిత్రహింసలకు గురిచేశారన్నారు. వారి అరుపులు ఆ ప్రాంతం మొత్తం వినబడేలా వారికి దగ్గరగా మైక్ అమర్చారని, దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయాలని వస్తున్న డిమాండ్లపై రషీద్ స్పందిస్తూ.. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చేందుకు ఈ డిమాండ్లు చేస్తున్నారన్నారు. బీజేపీ అజెండా అమలు కోసం ఈ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా, రషీద్ ఆరోపణలను ఆర్మీ తీవ్రంగా ఖండించింది. ఆమె ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది. దీంతో ఆమె తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, ఆమెను అరెస్ట్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ ఆమెపై క్రిమినల్ ఫిర్యాదు కూడా దాఖలు చేశారు.

70 మంది ఉద్యోగాలను కాపాడిన ప్రభుత్వం

కశ్మీర్‌లోయలో ఆంక్షల నేపథ్యంలో వ్యాపారం భారీగా దెబ్బతినడంతో ఒక బహుళజాతి కంపెనీ 70 మంది కశ్మీర్ ఉద్యోగులను తొలిగించేందుకు నోటీసు జారీ చేయగా, జమ్ముకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వారి ఉద్యోగాలను కాపాడింది. ప్రముఖ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఏజిస్ శుక్రవారం శ్రీనగర్‌లోని తన బీపీవో ఆఫీసు మూసివేసి 70 మంది ఉద్యోగులను తొలిగిస్తూ నోటీసు ఇచ్చింది. ఏజిస్ ఏకైక క్లయింట్ వొడాఫోన్ కాల్స్ రోజుకు లక్ష నుంచి 10 వేలకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులను తొలిగించగా, ఈ వార్త కశ్మీర్ ప్రభుత్వానికి చేరింది. దీంతో శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వెంటనే స్పందించారు. ఏజిస్ కంపెనీని సంప్రదించి ఉద్యోగులను తొలగించ వద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు మూడు నెలల వేతనాలు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

కనిపించని పెండ్లి సందడి!


Kashmiri-Wedding
ఆర్టికల్ 370 రద్దు తర్వాత విధించిన ఆంక్షలతో కశ్మీర్ లోయలో పెండ్లి సందడి కనిపించడం లేదు. ఆర్భాటానికి బదులు సాదాసీదాగా పెండ్లి జరిపించేందుకు ప్రజలు మొగ్గుతున్నారు. దీంతో ఈ వివాహ సీజన్‌లో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వివాహ దుస్తులు, బంగారం దుకాణాలు బోసిపోయాయి. వాజవాన్ (సంప్రదాయ కశ్మీరీ వంటకం) వంటవాళ్లకు పని లేకుండాపోయింది. మరోవైపు వివా హ ఆహ్వానం రద్దు ప్రకటనలకు దినపత్రికలు ప్రత్యేకంగా ఓ పేజీని కేటాయిస్తుండడం గమనార్హం. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నా కుమారుడి పెండ్లి వేడుకను మామూలుగా నిర్వహిస్తున్నాం. దీంతో వివాహ విందు ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నాం.

అసౌకర్యానికి చింతిస్తున్నాం అని స్థానిక ఉర్దూ డైలీలో ఓ ప్రకటన కనిపించింది. ఆ పత్రిక సోమవారం నాటి ఎడిషన్‌లో 25కు పైగా అలాంటి ప్రకటనలు ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం ఒక ప్రైవేట్ టీవీ చానల్ వివాహ రద్దు ప్రకటనను ఉచితంగా ప్రసారం చేస్తున్నది. వాజవాన్ వంటగాడైన ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ.. సాధారణంగా 600-800 మంది అతిథుల కోసం వివాహ విందుకు ఆర్డర్లు వస్తాయి. ప్రస్తుతం 150-200 మందికే ఆర్డర్లు వస్తున్నాయి అని తెలిపారు. దీంతో తమ ఆదాయం 70% తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అల్లర్లు, వరదల తదితర కారణాలతో 2008 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు వివాహ సీజన్‌పై ప్రభావం పడిందని చెప్పారు. మొహమ్మద్ ఇక్బాల్ అనే నగల వ్యాపారి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులతో తమ వ్యాపారం 50% పడిపోయిందని తెలిపారు.

1165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles