వికటించిన తులాభారం శశిథరూర్‌కు గాయం


Tue,April 16, 2019 11:15 AM

Shashi Tharoor In Hospital After Injuries During Ritual At Kerala Temple

తిరువనంతపురం, ఏప్రిల్ 15: సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం అభ్యర్థి శశి థరూర్‌కు గాయాలయ్యాయి. కేరళ సంవత్సరాది విషు సందర్భంగా స్థానిక దేవీ దేవాలయంలో నిర్వహించిన తులాభారంలో అపశృతి దొర్లింది. సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ముందు కుటుంబ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే వీఎస్ శివకుమార్ తదితరులతో కలిసి శశిథరూర్ తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రాసులో కూర్చున్న శశిథరూర్‌కు సమాన బరువు గల ఆహార పదార్ధాలు, పూలు, పండ్లు, ఇతర వస్తువుల రూపేణా అమ్మవారికి ఇచ్చే కానుకలే తులాభారం. ఈ సందర్భంగా దీపారాధన కోసం వేచి ఉండగా అనూహ్యంగా శశిథరూర్ పట్టుతప్పి కింద పడిపోయారు. త్రాసు ఆయన తలను తాకడంతో గాయమైంది.

దీంతో శశిథరూర్‌ను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించగా ఆరు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. ఆయన కాలుకు కూడా స్వల్ప గాయమైంది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను తిరువనంతపురం మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించారు. శశిథరూర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్య వర్గాలు చెప్పాయి. థరూర్‌కు ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేవు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కానీ సందర్శకుల రాకతో ఆయనను అబ్జర్వేషన్ వార్డు నుంచి ఐసీయూకు తరలించాం అని వైద్యాధికారి ఒకరు తెలిపారు. శశిథరూర్‌కు గాయమైన నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసినట్లు స్థానిక కాంగ్రెస్ నేత థంపనూర్ రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

1189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles