ఆగని కీచకపర్వం

Wed,December 4, 2019 03:20 AM

- ఉత్తర్‌ప్రదేశ్‌లో తల్లీకూతుళ్లపై లైంగికదాడి
- బీహార్‌లో బాలికపై అఘాయిత్యం.. తుపాకితో కాల్చివేత
- ఒడిశాలో పోలీస్‌ క్వార్టర్స్‌లోనే మహిళపై సామూహిక లైంగికదాడి

ఆజంగఢ్‌: ‘దిశ’ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఓవైపు తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నా, మరోవైపు మహిళలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక కీచకుడు ఒక వ్యక్తిని హతమార్చి, అతడి భార్య, కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరోవైపు, బీహార్‌లో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఒక బాలికపై లైంగికదాడికి పాల్పడి చంపేశారు. అనంతరం నిప్పంటించి తగులబెట్టారు.

తల్లి, కూతురిపై దారుణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజాంగఢ్‌లో గతవారం దంపతులను, వారి కుమారుడిని హత్యచేయడంతోపాటు, మరో ఇద్దరు పిల్లలను తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మహిళ, కూతురు అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత వారిపై అతడు లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 24న ఈ దారుణం జరిగింది.

బాలికపై లైంగికదాడి.. హత్య

దిశ ఘటన తరహాలోనే బీహార్‌లో మరో దారుణం జరిగింది. బక్సర్‌ జిల్లాలోని కుకుంద గ్రామంలో బాలికపై లైంగికదాడికి పాల్పడిన దుండగులు అనంతరం ఆమెను తుపాకీతో కాల్చి చంపి, మృతదేహాన్ని తగులబెట్టారు. హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు భావిస్తున్నామని, సోమవారం రాత్రి ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు.

మహిళపై అఘాయిత్యం

ఒడిశాలోని పూరిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌, అతడి సహచరుడు పోలీస్‌ క్వార్టర్‌లోనే ఒక మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇంకో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

పెండ్లి పేరుతో మైనర్‌పై..

మంద్‌సౌర్‌ : పెండ్లి పేరుతో వంచించి మైనర్‌పై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌కు చెందిన సోనూ కుమావత్‌ తనకు పరిచయమున్న యువతిని ఇటీవల హోటల్‌ గదికి తీసుకెళ్లాడు. మెడలో పూలదండ వేసి, నుదుట బొట్టు పెట్టి పెండ్లి అయినపోందని చెప్పి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

తొమ్మిదేండ్ల బాలికపై హత్యాచారం

బెంగళూరు: ఓ కామాంధుడు తొమ్మిదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. తినేందుకు ఏమైనా ఇస్తానని ఆశచూపిన నిందితుడు బాలికను నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడి చేసి, హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు యల్లప్ప మహదేవప్పను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

రాజస్థాన్‌లో విద్యార్థినిపై..

కోటా: రాజస్థాన్‌లో ఓ బాలికపై లైంగికదాడి జరిగింది. తరుచుగా ఇంటికొచ్చే ఓ బంధువు 11వ తరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని ఓ టీచర్‌కు చెప్పింది. టీచర్‌ సూచనతో తన నానమ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

పగ పెంచుకొని..

భోపాల్‌: లైంగిక దాడికి యత్నించినందుకు తనను జైలుకు పంపిన యువతిపై పగ పెంచుకుని దారుణంగా హత్య చేశాడు ఓ దుండగుడు. ఆ యువతిని కత్తితో 30సార్లు పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లాలో జరిగింది.

256
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles