భారీ ఎన్‌కౌంటర్


Thu,December 7, 2017 04:11 AM

seven-maoists-killed-by-police-in-gadchiroli

Encounter

-మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఏడుగురు మావోయిస్టులు హతం
-మృతుల్లో ఐదుగురు మహిళలు
-మేడిగడ్డకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఎదురుకాల్పులు
-అప్రమత్తమైన రాష్ట్ర పోలీస్ యంత్రాంగం

గడ్చిరోలి/కాళేశ్వరం, డిసెంబర్ 6: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా జింగనూర్ ఔట్‌పోస్ట్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని కల్లెడ్ గ్రామ అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కల్లెడ్ అడవుల్లో గత కొద్దిరోజులుగా మావోయిస్టుల ఆగడాలు శ్రుతిమించుతుండటంతో మహారాష్ట్రకు చెందిన యాంటీ మావోయిస్ట్ స్పెషల్ టీం.. ఆపరేషన్‌ను ప్రారంభించింది. మంగళవారం అర్ధరాత్రి సీ-60 దళానికి చెందిన అరవై మంది ప్రత్యేక కమెండోలు మావోయిస్టుల కోసం కల్లెడ్ అడవుల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. చత్తీస్‌గఢ్ సరిహద్దు వద్ద ఇరుపక్షాల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారని, ఇతర మావోయిస్టులు పారిపోయారని అధికారులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, రెండు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు, రెండు 12 బోర్ గన్‌లు, ఒక నాటు తుపాకీని సీజ్ చేశామన్నారు.

Encounter అటవీ ప్రాంతం నుంచి పోలీసులను, నక్సల్స్ మృతదేహాలను తీసుకురావడానికి ఒక హెలికాప్టర్‌ను పంపినట్టు స్పెషల్ ఐజీ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్) శరద్ షెలార్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపుతామని, మృతులను గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ నెల 2 నుంచి 8వ తేదీవరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారి కార్యకలాపాలు జిల్లాలో ఎక్కువయ్యాయి. గత నెలరోజుల్లో ఐదుగురు పౌరులు, ఇద్దరు పోలీసులను మావోయిస్టులు హత్య చేశారు. మరో ఐదుగురిని గాయపరిచారు. దీంతో శరద్ షెలార్‌తోపాటు అదనపు డీజీ (స్పెషల్ ఆపరేషన్స్) డీ కనకరత్నం, గడ్చిరోలి రేంజ్ డీఐజీ అంకుశ్ షిండేతోపాటు పలువురు సీనియర్ అధికారులు గడ్చిరోలిలో మకాంవేసి పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆపరేషన్‌పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. ఇదిలాఉండగా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు కేవలం 20 కి.మీ.ల దూరంలోనే ఉండటం, ఎన్‌కౌంటర్ ప్రభావంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకున్న మావోయిస్టులు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన ఉండటంతో ప్రాజెక్ట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకొన్న పోలీసులు.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజీత్ కపూర్ పర్యవేక్షణలో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సరిహద్దులోని అటవీ ప్రాం తం, రోడ్డు మార్గాలు, గ్రామాల్లో నిఘాను పెంచి, తనిఖీలు చేస్తున్నారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు.

1897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles