మలేరియా నాశకి.. టీసీఎండీసీ-135051

Thu,October 10, 2019 03:10 AM

- వ్యాధి నియంత్రణకు సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన పరిశోధకులు


న్యూఢిల్లీ: మలేరియా నియంత్రణలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. దోమల్లో నివసించే ప్లాస్మోడియం పాల్సీపారమ్‌ అనే పరాన్న జీవి.. దోమకాటు ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది. తాజాగా ఈ పరాన్నజీవులు మన శరీరంలోకి చేరిన తర్వాత ఎదుగకుండా అడ్డుకునే రసాయన మిశ్రమాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనిని టీసీఎండీసీ-135051 అని పిలుస్తున్నారు. సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన వీరి పరిశోధన వ్యాసం ప్రకారం.. సాధారణంగా దోమకాటు ద్వారా ప్లాస్మోడియం పాల్సీపారమ్‌ పరాన్నజీవులు మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రక్తంలోని ఎర్ర కణాల్లోకి ప్రవేశిస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి అనే రెండు విధానాల ద్వారా వాటి సంఖ్యను విపరీతంగా పెంచుకుంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పరాన్నజీవులు ఉత్పత్తి అయ్యి రక్తంలోకి చేరి వ్యాధిని కలుగజేస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ‘జైగోమాట్స్‌' అనే కణాలు వెలువడి రక్తంలో నిల్వ ఉంటాయి.

దోమ కరిచినప్పుడు అవి మానవుడి నుంచి దోమ శరీరంలోకి వెళ్తాయి. ఈ రెండు విధానాల్లోనూ ‘ఆర్‌ఎన్‌ఏ’లో జరిగే మార్పులే కీలకం. దీనికి ‘ప్రొటీన్‌ కైనేజ్‌(పీఎఫ్‌సీఎల్కే-3)’ అనే ఎంజైమ్‌ సమక్షంలోనే ఆర్‌ఎన్‌ఏలో మార్పులు జరుగుతాయి. శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాల అనంతరం టీసీఎండీసీ-135051 రసాయన మిశ్రమం ప్రొటీన్‌ కైనేజ్‌ను నియంత్రిస్తున్నట్టు గుర్తించారు. ‘మనం ప్రొటీన్‌ కైనేజ్‌ను నియంత్రించగలిగితే ఆర్‌ఎన్‌ఏలో మార్పులు కలుగవు. కాబట్టి ప్లాస్మోడియం కణాల సంఖ్య పెరగదు. ఫలితంగా మన శరీరంలోకి పరాన్న జీవులు చేరినా.. వ్యాధి వచ్చే అవకాశం ఉండదు’ అని పరిశోధక బృంద సభ్యుడు పౌలో గోడియో పేర్కొన్నారు. తాము దాదాపు 25వేల మిశ్రమాలను ప్రయత్నించి చివరగా టీసీఎండీసీ-135051ను గుర్తించామని చెప్పారు. మలేరియా కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మంది మరణిస్తున్నారు.

449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles