బిల్కిస్ బానోకు 50 లక్షల పరిహారం


Wed,April 24, 2019 02:49 AM

SC orders Gujarat govt to pay 50 lakh compensation to Bilkis Bano

-ఉద్యోగం, వసతి కూడా కల్పించండి..
-గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: గోద్రా ఘటన తర్వాత 2002లో గుజరాత్‌లో చెలరేగిన హింసాకాండలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి రూ.50 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు ఉద్యోగం, వసతి కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) రంజన్ గొగోయ్, జస్టిస్‌లు దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం మంగళవారం కేసు విచారణ చేపట్టింది. కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు గుజరాత్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సంబంధిత అధికారుల పెన్షన్ ప్రయోజనాలు నిలిపివేశామని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. మరో ఐపీఎస్ అధికారిని కూడా రెండు ర్యాంకులు డిమోట్ చేసినట్లు చెప్పారు. పరిహారం కింద ప్రభుత్వం ఇవ్వజూపిన రూ.5 లక్షలను బానో ఇంతకుముందే తిరస్కరించారు. తనకు ఆమోదయోగ్య పరిహారం ఇప్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 29న కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం.. రెండు వారాల్లో సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బానో తరఫు న్యాయవాది శోభా గుప్తా వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు దోషులుగా తేల్చిన పోలీస్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఓ ఐపీఎస్ అధికారి ఈ ఏడాది పదవీ విరమణ పొందనున్నారని, నలుగురు అధికారులు ఇప్పటికే రిటైరయ్యారని తెలిపారు. విచారణను పక్కదారి పట్టించేందుకు యత్నించినందుకు వారి ని బాంబే హైకోర్టు దోషులుగా తేల్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ దారుణ ఘటన అనంతరం బానో దాదాపు సంచార జీవితం గడుపుతున్నారన్నారు. కాబట్టి ఆమె కు ఆమోదయోగ్య పరిహారం ఇప్పించాలని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది తుషార్ మెహతా వాదిస్తూ.. సంబంధిత పోలీస్ అధికారులపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు ప్రారంభించామన్నారు. ఇలాంటి ఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం అందిస్తున్నదని తెలిపారు.

కేసు పూర్వాపరాలివీ..

ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం& గోద్రా ఘటన అనంతరం, 2002 మార్చి 3న అహ్మదాబాద్ సమీపంలోని రాంధిక్‌పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుటుంబంపై అల్లరిమూకలు దాడి చేశాయి. అప్పటికి ఐదునెలల గర్భవతి బానోపై దుండగులు పాశవికంగా లైంగిక దాడి చేశారు. ఆమె కుటుంబ సభ్యులను పలువురిని దారుణంగా హత్యచేశారు. తొలుత అహ్మదాబాద్‌లోనే కేసు విచారణ సాగింది. సాక్షులకు హాని తలపెట్టడంతోపా టు, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని బానో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో 2004 ఆగస్టులో కేసును ముంబై కి మార్చారు. 2008 జనవరి 21న ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరిస్తూ.. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. 2017 మే 7న బాంబే హైకోర్టు ఈ ఏడుగురిని (ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లు) దోషులుగా తేల్చింది.

దీన్ని సవాల్ చేస్తూ నలుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లు దాఖలు చేసిన అప్పీళ్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దిగువ కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ తరువాత వారు బాంబే హైకోర్టునాశ్రయించారు. సాక్ష్యాధారాలను సీబీఐ మార్చిందని, ఆ ఘటన తర్వాత బానో ఓ శిశువుకు జన్మనిచ్చిందని, ఆమె సామూహిక అత్యాచారానికి గురి కాలేదని తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి చెందిన పలువురి మృతదేహాలు లభ్యం కాలేదని, దీన్ని బట్టి వారు మృతిచెందలేదని తెలుస్తున్నదని పేర్కొన్నారు.

699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles