కుట్రకు ఆధారాలేంటి?


Wed,April 24, 2019 02:40 AM

SC notice to Utsav Bains in CJI Ranjan Gogoi sexual harassment claims

-లాయర్ ఉత్సవ్ బైన్స్‌ను వివరణ కోరిన సుప్రీంకోర్టు
-నేడు ఉదయం 10:30గంటలకు విచారణ

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక..ఆయన రాజీనామా చేసేలా పెద్ద కుట్ర జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది న్యాయవాది ఉత్సవ్ బైన్స్‌ను ఆధారాలేమిటో తెలుపాలని సుప్రీంకోర్టు కోరింది. జస్టిస్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని తరఫున వాదించ డంతోపాటు ప్రెస్‌క్లబ్‌లో సీజేఐకి వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహిస్తే తనకు రూ.కోటిన్నర ఫీజు చెల్లించేందుకు అజయ్ అనే వ్యక్తి సిద్ధపడ్డాడని ఉత్సవ్ ఒక అఫిడవిట్‌లో వెల్లడించిన సంగతి తెలిసిం దే. ఈ ఆరోపణలకు ఆధారాలేమిటో తెలుపాలని జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌లు ఆర్‌ఎఫ్ నారిమన్, దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఈ కేసు ఎంతో ప్రాముఖ్యమైనది, న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు సంబంధించినది అని వ్యాఖ్యానించింది. ఈ కేసుపై బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణ జరుపుతామని తెలిపింది.

ఆరోపణల గురించి విన్నప్పుడు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వెంటనే ఫిర్యాదిదారు తరఫున వాదించడానికి సిద్ధపడ్డానని బైన్స్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తం ఘటనల క్రమాన్ని, కేసు గురించి అజయ్ అనే వ్యక్తి వివరించినప్పుడు.. ఎన్నో లోపాలు కనిపించాయన్నారు. ఆ మహిళను కలువాలని చెప్పినా, మధ్యవర్తులు అంగీకరించలేదని, దీంతో తనకు సందేహాలు కలిగాయని వివరించారు. సీజేఐకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే రూ.50 లక్షలు ఇస్తానని అజయ్ ఆ సాక్షిని ప్రలోభ పెట్టాడు. సాక్షి నిరాకరించడంతో రూ.కోటిన్నరకు పెంచాడు అని బైన్స్ పేర్కొన్నారు. అక్రమ మార్గాల్లో తీర్పులను తారుమారు చేసే దళారులపై సీజేఐ ఉక్కుపాదం మోపినందున, వారందరూ ఆయనపై కక్ష గట్టినట్టు వర్గాలు ఆ సాక్షికి తెలిపాయి. పేర్కొన్నాయి అని బైన్స్ తన అఫిడవిట్‌లో వివరించారు.

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసును తానే విచారణ జరుపడం చట్టపరంగా, నైతికంగా కూడా తప్పేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంతోష్ హెగ్డే పేర్కొన్నారు. సీజేఐపై సంస్థాగత విచారణ
సీజేఐ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే దర్యాప్తు చేయనున్నారు. ఈ దర్యాప్తు సంస్థాగతంగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఓ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను పరిశీలించేందుకుగాను సుప్రీంకోర్టులో రెండో స్థానంలో ఉన్న తనను సీజేఐ నియమించారని తెలిపారు. మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీతో ఒక కమిటీని ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభిస్తానని చెప్పారు. జస్టిస్ రమణ సీనియారిటీలో తన తరువాతి స్థానంలో ఉన్నారని, మహిళ ప్రాతినిధ్యం కోసం జస్టిస్ బెనర్జీని కమిటీలో తీసుకున్నామని తెలిపారు.

సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ జడ్జీలకు లేఖలు రాయడమే కాకుండా అఫిడవిట్ కూడా దాఖలు చేసిన సదరు మహిళా ఉద్యోగికి నోటీసులు జారీ చేశానని జస్టిస్ బాబ్డే చెప్పారు. ఈ నెల 26న మొదటి విచారణ జరుగుతుందని, ఈ మేరకు పత్రాలను సిద్ధం చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశించామని తెలిపారు. ఇందులో న్యాయవాదుల పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. తమ దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలను రహస్యంగా ఉంచుతామన్నారు. దర్యాప్తును ముగించడానికి గడువేమీ విధించలేదని పేర్కొన్నారు.

283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles