చిదంబరానికి బెయిల్

Wed,October 23, 2019 02:16 AM

-సీబీఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు
-ఈడీ కస్టడీలో కొనసాగుతున్న కేంద్ర మాజీ మంత్రి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. దాదాపు రెండు నెలలుగా దర్యాప్తు సంస్థల కస్టడీలో, జైలులో ఉన్న చిదంబరానికి సుప్రీం కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఆయన ఇంకా విడుదల కాలేదు. సీబీఐ దాఖలు చేసిన ఐఎన్‌ఎస్ మీడియా అవినీతి కేసులో చిదంబరానికి బెయిల్ లభించినప్పటికీ అదే కేసుతో సంబంధం ఉన్న మరో హవాలా కేసులో ప్రస్తుతం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. చిదంబరాన్ని గత ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ కస్టడీ ముగిసిన తర్వాత ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 18న ఢిల్లీ కోర్టు ఆయనను గురువారం వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ఆయన విమానంలో పారిపోయేవాడు కాదు.. లేదా విచారణకు గైర్హాజరయ్యే అవకాశం లేదు అని ముగ్గురు సభ్యుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమ తీర్పు ఇతర కేసులకు వర్తించదని స్పష్టం చేసింది. సాక్షులను చిదంబరం ప్రభావితం చేసే అవకాశముందన్న సీబీఐ వాదనను జస్టిస్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. రూ. లక్ష పూచీకత్తు, ఇద్దరి జామీనుపై చిదంబరాన్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. చిదంబరం తన పాస్‌పోర్టును ప్రత్యేక కోర్టులో డిపాజిట్ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. సీబీఐ ఎప్పుడు కోరినా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది.

242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles