చౌకీదార్ చోర్ అని మేం అనలేదు!


Tue,April 16, 2019 11:12 AM

SC gives Rahul Gandhi till April 22 to explain Rafale comments

-అననిదానిని మాకు ఆపాదించినట్టు తెలుస్తున్నది
-రాహుల్‌గాంధీ.. దీనిపై ఈ నెల 22లోగా వివరణ ఇవ్వండి
-కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: రాఫెల్ కేసులో ప్రధాని నరేంద్రమోదీని సుప్రీంకోర్టు దొంగగా తేల్చిదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆయన వివరణ కోరింది. సుప్రీంకోర్టు అనని వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తప్పుగా ఆపాదించారని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్, జస్టిస్‌లు దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. రాహుల్‌గాంధీ ఈ నెల 22లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టుకు సమర్పించిన పత్రాలను బట్టి రాహుల్‌గాంధీ కొన్ని వ్యాఖ్యలను కోర్టుకు తప్పుగా ఆపాదించారని తెలుస్తున్నది. వీటి ఆధారంగా తుది నిర్ణయం తీసుకోలేం. రాఫెల్ కేసుపై మా ఆదేశాల్లో చౌకీదార్ చోర్ హై వంటి పదాలను మేము వాడలేదు. కాబట్టి దీనిపై రాహుల్‌గాంధీ వివరణ ఇవ్వాలి అని కోర్టు పేర్కొంది.

వచ్చే సోమవారంలోగా (ఈనెల 22) వివరణను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి (ఏప్రిల్ 23) వాయిదా వేసింది. రాఫెల్ ఒప్పందంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఈ నెల 9న అంగీకరించిన సంగతి తెలిసిందే. పిటిషనర్ కొత్తగా సమర్పించిన పత్రాల ఆధారంగా విచారణ జరిపి తీర్పును సమీక్షిస్తామని న్యాయస్థానం పేర్కొన్నది. కాగా, రాహుల్‌గాంధీ ఈనెల 10న అమేథీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ దొంగ అని సుప్రీంకోర్టు సైతం నిర్ధారించిందన్నారు. భారత వాయుసేన సొమ్మును అనిల్ అంబానీకి మన ప్రధాని దోచిపెడుతున్నారని నేను కొన్ని నెలలుగా చెప్తున్నాను. సుప్రీంకోర్టు ఇప్పటికి ఈ విషయం అంగీకరించింది. ఈ కేసు పునర్విచారణకు న్యాయస్థానం అంగీకరించడం చాలా సంతోషంగా ఉన్నది అని రాహుల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖి.. కోర్టు అనని విషయాలనూ రాహుల్‌గాంధీ తప్పుగా ఆపాదిస్తున్నారని కోర్టు ధిక్కరణ కింద విచారణ జరుపాలని పిటిషన్‌వేశారు.

వివరణ ఇస్తాం.. క్షమాపణ చెప్పాల్సిందే..

తమ పార్టీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై కోర్టు ఆదేశం మేరకు త్వరలో వివరణ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. మరోవైపు బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ప్రధాని మోదీకి రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందేనన్నది. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ రోజూ అబద్ధాలు చెబుతుంటారని చెప్పారు. పిటిషనర్ మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. ఆ(రాహుల్) కుటుంబంలో నలుగురులు సభ్యులు ఉంటే, ముగ్గురు బెయిల్‌పై తిరుగుతున్నారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి విషయాలను తెరమీదికి తెస్తున్నారని మండిపడ్డారు.

247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles