దేశ సంస్కృతిపై తాజ్ ఓ మచ్చ!Tue,October 17, 2017 02:40 AM

-అది ద్రోహులు నిర్మించిన కట్టడమన్న యూపీ బీజేపీ ఎమ్మెల్యే
- హిందూరాజుల గొప్పతనాలతో చరిత్రను తిరుగరాస్తామని ప్రకటన

tajmahal
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కాలం చెక్కిలి మీద కన్నీటి చారికగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అభివర్ణించిన తాజమహల్ చుట్టూ ఆవేశకావేశాల పొగలూసెగలూ కమ్ముకుంటున్నాయి. మథుర రిఫైనరీ కాలుష్యం కన్నా రాజకీయ రచ్చతో ఎక్కువ మకిలి చేరుతున్నట్టు కనిపిస్తున్నది. ఉత్తర్‌ప్రదేశ్ సర్కారు టూరిజం పుస్తకాల్లో తాజ్‌మహల్‌కు చోటు లేకుండా చేసిన వివాదం ఇంకా సద్దుమణగక ముందే అదే రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఒకడుగు ముందుకు వేశారు. తాజ్‌మహల్ భారతీయ సంస్కృతికి మచ్చ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ద్రోహులు నిర్మించిన కట్టడమని, ఆ ద్రోహుల చరిత్ర ఎందుకు చదువాలని అన్నారు. యూపీ సర్కారు అధికారికంగా ప్రచురించిన టూరిజం పుస్తకంలో తాజ్‌మహల్ లేనందుకు చాలామంది బాధపడుతున్నారు. వారికి ఏం చరిత్ర కావాలట? తాజ్‌మహల్ కట్టిన వ్యక్తి తండ్రిని చెరసాలలో బంధించాడు. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించాడు. ఈ చరిత్రేనా వారికి కావాల్సింది? అని సోమ్ ప్రశ్నించారు.

సోమ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు


సోమ్ ఇలా వివాదాస్పదంగా మాట్లాడడం ఇదే మొదటిసారికాదు. గతంలో దాద్రీ బీఫ్ వివాదం లోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 60మందిని బలిగొన్న ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు ఆయనపై పోలీసు కేసు నడుస్తున్నది. తాజాగా ఆదివారం తాజ్‌మహల్‌పై వ్యాఖ్యలతో మరో వివాదానికి తెరలేపారు. మీరట్ సమీపంలోని సిసోలీలో అనంగపాల్‌సింగ్ అనే 8వ శతాబ్దపు హిందూరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సోమ్ మాట్లాడుతూ.. బాబర్, అక్బర్, ఔరంగజేబ్‌ల కళంకిత చరిత్ర చెరిపేస్తామని, రాణాప్రతాప్, శివాజీ వంటి మహానుభావుల కథలతో చరిత్రను తిరగరాస్తామని అన్నారు. యూపీ సర్కారు ఈదిశగా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. అయోధ్యలో రామమందిరం, మథురలో కృష్ణమందిరం నిర్మించకుండా ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. కాగా, సోమ్ చేసిన వ్యాఖ్యలపై పాలక బీజేపీ నేతలు తలోరకంగా స్పందించారు.
Sangeet-Som

ఎర్రకోట మీద జెండా ఎగురేయరా?


తాజ్ వివాదంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. తాజ్‌మహల్‌ను ద్రోహులు నిర్మిస్తే ఎర్రకోటను కూడా ఆ ద్రోహులే నిర్మించారు. మరి ప్రధాని ఎర్రకోటపై జెండా ఎగురేయకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్ మాజీసీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే అభిప్రాయాల్ని వ్యక్తంచేశారు.

1074

More News

VIRAL NEWS