పాక్‌పై ఆగ్రహజ్వాల


Sun,February 17, 2019 02:46 AM

Sacrifice Of Soldiers Killed In Pulwama Attack Wont Go In Vain

-పుల్వామా అమరులకు జాతి ఘన నివాళి ..
-కన్నీటితో అంతిమ వీడ్కోలు
-ప్రతి కన్నీటిబొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంటాం
-ముష్కరశక్తులకు ప్రధాని మోదీ హెచ్చరిక
-సైనికబలగాలకు అఖిలపక్షం సంఘీభావం
-పీఓకేలోని ఉగ్రశిబిరాలపై గగనతల దాడులు!

గుండెలను అలుముకున్న తీవ్ర విషాదం, పట్టరాని ఆగ్రహం కలగలిసి యావత్‌దేశం అమరజవాన్లకు నివాళిని అర్పించింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ.. ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఇంతటి దారుణానికి కారణమైన ఉగ్రరాక్షసులను వధించాల్సిందేనని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగుదేశానికి దిమ్మ తిరిగే గుణపాఠం నేర్పించాల్సిందేనని భారతావని నినదించింది. పుల్వామాలో ఓ ఉగ్రవాద ఘాతుకంలో అమరులైన 40 మంది వీర జవాన్ల పార్థివదేహాలకు వారివారి స్వస్థలాల్లో శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలసంఖ్యలో ప్రజలు అధికార లాంఛనాల మధ్య జాతివీరులకు కన్నీటి వీడ్కోలు పలికారు. మరోవైపు, అమరజవాన్ల బలిదానం వృథాకాబోదని, దెబ్బకు దెబ్బ తీస్తామని, ప్రతి కన్నీటిబొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ ముష్కర శక్తులను హెచ్చరించారు. ఉగ్రరక్కసిపై పోరాటంలో ప్రభుత్వానికి అండగా ఉంటామన్న అఖిలపక్ష సమావేశం.. భద్రతాదళాలకు పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఈసారి ఉగ్రవాదులను కోలుకోని రీతిలో దెబ్బతీయాలని రక్షణరంగ నిపుణులు కేంద్రానికి సూచించారు.

రెండేండ్ల కిందటి సర్జికల్ ైస్ట్రెక్స్ మాదిరిగా ఉపరితలం నుంచి కాకుండా ఈసారి అనూహ్యంగా వైమానిక దాడులతో ముష్కరుల పీచమణచాలని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై వైమానికదాడుల దిశగా యోచిస్తున్నట్టు సంకేతాలు వెలువరించింది. 140 యుద్ధవిమానాలు, హెలికాప్టర్లతో పాకిస్థాన్ సరిహద్దులో వాయుసేన భారీస్థాయి విన్యాసాలు నిర్వహించింది. దేశ రాజకీయ నాయకత్వం తమకు బాధ్యతను అప్పగిస్తే.. తగిన విధంగా స్పందించటానికి సిద్ధమని ఎయిర్‌చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా చెప్పారు. మరోవైపు, పాకిస్థాన్‌పై ఆర్థికదాడిని మరింత ఉధృతం చేసిన కేంద్రం.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాన్ని 200% పెంచింది.

763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles