కళారంగ మేరునగం ఎస్‌హెచ్ రజా కన్నుమూత


Sun,July 24, 2016 01:56 AM

s. h. raza passed away

-ప్రపంచ కళావేదికపై భారతీయతను
ఆవిష్కరించిన మేటి
-వరించిన అనేక అవార్డులు

న్యూఢిల్లీ, జూలై 23: భారతీయ భావనలను, ప్రతీకలను తన కుంచె ద్వారా ప్రపంచానికి ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు ఎస్‌హెచ్ రజా 94వ ఏట ఢిల్లీలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో శనివారం కన్నుమూశారు. భారతీయ కళా ప్రపంచంలో మేరునగంలా పరిగణించే రజా కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్నారు. బిందు, పురుష్-ప్రకృతి, నారి వంటి కళాఖండాల ద్వారా ఆయన ప్రసిద్ధి పొందారు. సులభంగా అర్థమయ్యే అమూర్త రేఖాగణిత శైలిలో ఆయన బొమ్మలు గీసేవారు. రజా మృతితో 20 శతాబ్దపు గొప్ప కళాకారుని కోల్పోయాం అని కవి, లలితకళా అకాడమీ మాజీ చైర్మన్ అశోక్ వాజపేయి నివాళులు అర్పించారు.
sh-raza
మధ్యప్రదేశ్‌లోని మడాలా జిల్లా బాబరియాలో 1922లో జన్మించిన రజా 12వ ఏటనుంచే బొమ్మలు వేయడం ప్రారంభించారు. ఫ్రెంచ్ ప్రభు త్వ స్కాలర్‌షిప్‌పై 1950లో పారిస్ వెళ్లిపోయి అక్కడే సుమారు ఆరు దశాబ్దాలపాటు స్థిరపడ్డారు. ఎఫ్‌ఎన్ సూజా, కేహెచ్ ఆరా, ఎంఎఫ్ హుసేన్, హెచ్‌ఏ గడే, ఎస్కే బక్రే తదితర ఉద్ధండులతో దలిసి ఆయన బాంబే ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్‌స్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అత్యున్నత ఫ్రెంచ్ పురస్కారం లెజెన్ దె ఆనర్, భారత ప్రభుత్వం నుంచి 1981లో పద్మశ్రీ, 2007 లో పద్మభూషణ్, 2013లో పద్మవిభూషణ్ అందుకొన్నారు. రజా మృతికి సంతాపంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా సంతాపం తెలిపారు.

919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS